Telugu Global
NEWS

సుప్రీం కోర్టుకే మస్కా కొట్టిన జేసీ బ్రదర్స్‌

పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీం కోర్టు 2017 మార్చి 29వ తేదీన కొత్త నిబంధనలను అమలులోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2017 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లే బిఎస్‌-3 వాహనాలను నిషేధిస్తూ…. బిఎస్‌-4 వాహనాలు మాత్రమే ఏప్రిల్‌ 1 వ తేదీ నుంచి విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సుప్రీం కోర్టు నిబంధనలకు తూట్లు పొడుస్తూ జేసీ బ్రదర్స్‌… కర్నాటక, ఉత్తరాఖండ్‌ లో అశోక్‌ లేల్యాండ్‌ నుంచి బిఎస్‌-3 వాహనాలను […]

సుప్రీం కోర్టుకే మస్కా కొట్టిన జేసీ బ్రదర్స్‌
X

పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీం కోర్టు 2017 మార్చి 29వ తేదీన కొత్త నిబంధనలను అమలులోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2017 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లే బిఎస్‌-3 వాహనాలను నిషేధిస్తూ…. బిఎస్‌-4 వాహనాలు మాత్రమే ఏప్రిల్‌ 1 వ తేదీ నుంచి విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ సుప్రీం కోర్టు నిబంధనలకు తూట్లు పొడుస్తూ జేసీ బ్రదర్స్‌… కర్నాటక, ఉత్తరాఖండ్‌ లో అశోక్‌ లేల్యాండ్‌ నుంచి బిఎస్‌-3 వాహనాలను కొన్నట్లు చూపుతూ వాటిని నాగాలాండ్‌లో బిఎస్‌-4 వాహనాలుగా 2018 ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో రిజిస్ట్రేషన్‌ చేయించారు. అంటే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన ఒకటిన్నర సంవత్సరాల తరువాత సుప్రీం తీర్పుని తుంగలో తొక్కి ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌ కు పాల్పడ్డారు. ఇలా రిజిస్టర్‌ అయిన 68 వాహనాలు తాడిపత్రి కేంద్రంగా తిరుగుతున్నట్లు రవాణాశాఖ గుర్తించింది.

తాత్కాలిక అడ్రస్‌గా నాగాలాండ్‌లోని కోహిమా అడ్రస్‌లు ఇచ్చి… పర్మినెంట్‌ అడ్రస్‌లుగా తాడిపత్రిలో అడ్రసులు ఇచ్చారు.

కొన్ని వాహనాలు తాడిపత్రికి చెందిన చవ్వా గోపాల్‌ రెడ్డి పేరుతో రిజిస్టర్‌ అయితే మరికొన్ని వాహనాలు జేసీ ప్రభాకర్‌ రెడ్డి భార్య జేసీ ఉమ పేరుతో రిజిస్టర్‌ అయ్యాయి.

ఈ వాహనాలను నాగాలాండ్‌ నుంచి ఎన్‌ఓసీ తీసుకొని రిజిస్టర్‌ అయిన రెండు వారాల్లోనే తాడిపత్రికి తీసుకొచ్చారు. ఈ వాహనాలపై ఫిర్యాదు రావడంతో ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌ మెంట్ అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీకి 2018 జనవరి 10వ తేదీన లేఖ రాశారు. దీనికి స్పందించిన అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ 2017 మార్చి నెలాఖరు తారువాత మిగిలిన బిఎస్‌-3 వాహనాలను స్క్రాప్‌ కింద అమ్మేశామని తెలియజేశారు. అంటే జేసీ బ్రదర్స్‌ ఈ వాహనాలను చట్ట విరుద్ధంగా కొని, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్‌ చేయించుకుని తిప్పుతూ ఉండడాన్ని రవాణాశాఖ గుర్తించి కేసులు నమోదు చేసింది.

ఈ కేసులో జేసీ ట్రావెల్స్‌ పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడమే కాకుండా… సుమారు 100 కోట్లు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని ఏపీ రవాణాశాఖ జాయింట్‌ కమిషనర్‌ ప్రసాదరావు కొద్దిరోజుల క్రితం చెప్పారు.

First Published:  13 Jun 2020 9:45 AM GMT
Next Story