మరో సినిమా కొనుగోలు చేసిన ఈటీవీ

శాటిలైట్ మార్కెట్ కు దూరంగా ఉండే ఈటీవీ.. ఓ సినిమా రైట్స్ దక్కించుకుంది. సత్యదేవ్ హీరోగా నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా శాటిలైట్ రైట్స్ ను ఈ ఛానెల్ దక్కించుకుంది. ఆర్కా మీడియా బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలో ఇక రిలీజ్ చేయరు. నెట్ ఫ్లిక్స్ లో త్వరలోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆ వెంటనే ఈటీవీలో ప్రసారమౌతుంది. అలా ఈ సినిమా కథ ముగుస్తుంది.

శాటిలైట్ బిజినెస్ కు, ఈటీవీకి ఆమడదూరం. ఈ బిజినెస్ నుంచి చాలా ఏళ్ల కిందటే తప్పుకుంది ఈటీవీ. తన దగ్గరున్న పాత 900 సినిమాల్నే అటు తిప్పి, ఇటు తిప్పి ప్రసారం చేస్తుంది. అమీతుమీ లాంటి కొత్త సినిమాలు ఒకట్రెండ్ మినహా ఈటీవీ వద్ద కొత్త సరకు లేదు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఈటీవీపై ఈ ప్రభావం గట్టిగా పడింది.

సీరియల్స్, ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు లేకపోవడంతో.. జెమినీ, స్టార్ మా లాంటి ఛానెల్స్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్రసారం చేశాయి. అలా తమ రేటింగ్ తగ్గకుండా చూసుకున్నాయి. ఈటీవీ మాత్రం బుక్కయిపోయింది. పాత సినిమాలు రిపీట్ చేయలేక, కొత్త సినిమాల్లేక చేతులెత్తేసింది. ఫలితంగా టీఆర్పీలు దారుణంగా పడిపోయాయి.

ఈ నేపథ్యంలో కుదిరితే మరోసారి శాటిలైట్ మార్కెట్లోకి ప్రవేశించాలని ఆ ఛానెల్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. త్వరలోనే మరిన్ని సినిమాల్ని ఈ సంస్థ దక్కించుకునే అవకాశం ఉంది.