ఎమ్మెల్యే గన్‌మెన్లకు కరోనా… ఆఫీస్‌లో మరో ముగ్గురికి…

ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గన్‌మెన్లు కరోనా బారిన పడ్డారు. తొలుత సురేష్‌ అనే గన్‌మెన్‌కు కరోనా సోకింది. అతడు ఇటీవల చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయారని తొలుత భావించారు. మృతదేహానికి కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ అని తేలింది. దాంతో అతడితో పాటు ఉన్న గన్‌మెన్లకు పరీక్షలు నిర్వహించారు.

కరోనా వచ్చిన వ్యక్తులను వివక్షతో చూడడం మానుకోవాలని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కోరారు. కరోనా ఎవరికైనా రావొచ్చునని… దానికి ఎవరూ బాధ్యులు కాదన్నారు. గన్‌మెన్‌ సురేష్‌ 12 ఏళ్ల నుంచి తన వద్దే ఉండేవాడని… తొలుత జ్వరం వచ్చిందని… కరోనా అని చెప్పుకుంటే వివక్షతో చూస్తారేమో అని సమాజానికి భయపడి చికిత్స చేయించుకోక అతడు చనిపోయారన్నారు.

అతడి వల్ల మరో ముగ్గురు గన్‌మెన్లకు కరోనా వచ్చిందన్నారు. ఆఫీస్‌లోని మరో ముగ్గురు సిబ్బందికి కూడా కరోనా వచ్చిందని చెప్పారు. తానూ పరీక్షలు చేయించుకున్నానని… పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వివరించారు. రాబోయే రెండుమూడు నెలల్లో భారీగా కరోనా వచ్చి వెళ్తుందన్నారు. కరోనాతో జీవించడం ఎలా అన్నది నేర్చుకోవాలన్నారు.