Telugu Global
International

కరోనా నుంచి రోగులను కాపాడుతున్న డెక్సామెథాసోన్

ప్రపంచ దేశాల్లో కరోనా రోజు రోజుకూ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మందికి ఈ వ్యాధి సోకగా.. దాదాపు 4 లక్షల మంది చనిపోయారు. ఇండియాలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత కోవిడ్-19 సంక్రమణ పెరిగిపోతోంది. గత వారం రోజులుగా సగటున రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో 3 లక్షల కేసులు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు […]

కరోనా నుంచి రోగులను కాపాడుతున్న డెక్సామెథాసోన్
X

ప్రపంచ దేశాల్లో కరోనా రోజు రోజుకూ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మందికి ఈ వ్యాధి సోకగా.. దాదాపు 4 లక్షల మంది చనిపోయారు. ఇండియాలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత కోవిడ్-19 సంక్రమణ పెరిగిపోతోంది. గత వారం రోజులుగా సగటున రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో 3 లక్షల కేసులు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

కాగా, కరోనా కోరల్లో చిక్కుకొని వెంటిలేటర్‌పై విషమ పరిస్థితుల్లో కూడా ఉన్న రోగులను ఒక ఔషధం కాపాడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. అదే డెక్సామెథాసోన్ అనే స్టెరాయిడ్. అతి తక్కువ స్థాయిలో ఈ స్టెరాయిడ్ వాడటం వల్ల మృత్యువుకు కూడా దగ్గరైన బాధితులు కోలుకున్నట్లు బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు తేల్చి చెప్పారు. గత కొన్ని రోజులుగా ఈ స్టెరాయిడ్ ఉపయోగించి పరిశోధనలు జరపగా మంచి ఫలితాలు వచ్చాయని… బాధితుల్లో మూడో వంతు కోలుకున్నారని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన బాధితుల్లో ప్రతీ 20 మందిలో 19 మంది ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటున్నారు. ఆ మిగిలిన ఒక్కరికి మాత్రం ఆసుపత్రిలో వెంటిలేటర్ కాని, ఆక్సిజన్ కాని అందించి చికిత్స చేస్తున్నారు. ఇలాంటి వారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. వారికి డెక్సామెథాసోన్ కొద్ది మోతాదులో ఇస్తే మనిషి ప్రాణాలకు ప్రమాదం లేకుండా కాపాడుతోంది. ఈ స్టెరాయిడ్ వాడకానికి సంబంధించి జరిగిన పరిశోధనల్లో పాల్గొన్న ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ హార్బి పలు విషయాలు తెలియజేశారు.

ఇప్పటి వరకు కరోనా వల్ల ప్రాణాలు నిలపడంలో అత్యధిక ఫలితాలు ఇచ్చిన తొలి ఔషధం ఇదేనని ఆయన చెప్పారు. ఈ పరిశోధనలు చేసిన ఆక్స్‌ఫర్డ్ బృందం యూకేలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 2 వేల మందికి ఈ స్టెరాయిడ్ ఇచ్చారు. ఈ గణాంకాలను ఈ మందు వాడని 4 వేల మందితో పోల్చి చూడగా కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది.

డెక్సామెథాసోన్ ఇవ్వడం వల్ల వెంటిలేటర్‌పై ఉన్న రోగుల్లో మరణ ప్రమాదాన్ని 40 నుంచి 28 శాతానికి, ఆక్సిజన్ అవసరమైన రోగుల్లో మరణ ప్రమాదాన్ని 25 నుంచి 20 శాతానికి తగ్గినట్లు పరిశోధనలో వెల్లడైంది. వెంటిలేటర్‌పై ఉన్న వారిలో ప్రతీ 8 మందిలో ఒకరిని ఈ స్టెరాయిడ్ ద్వారా రక్షించవచ్చని హెర్బి అన్నారు.

జనరిక్ ఔషధమైన ఈ స్టెరాయిడ్ ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ ధరకే దొరుకుతుందని.. యూకేలో ఒక డోస్ 5 పౌండ్లు (రూ. 450)కి లభిస్తుంది. పది రోజుల పాటు కొద్ది మొత్తంలో తీసుకుంటే కరోనా నుంచి రక్షించే వీలుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇదే విషయాన్ని వెల్లడిస్తూ.. కరోనా విషయంలో మనం ఆనందించదగ్గ విజయాన్ని సాధించామని చెప్పారు. దేశంలో తగినన్ని డెక్సామెథాసోన్ డోసులు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే కరోనా రోగులెవ్వరూ దీన్ని సొంతంగా తీసుకోవద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

First Published:  16 Jun 2020 8:25 PM GMT
Next Story