చైనా సంస్థ కాంట్రాక్టు రద్దు చేసిన రైల్వే శాఖ

ఇండో-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో దేశ వ్యాప్తంగా చైనా ఉత్పత్తులు, వస్తువులు, కంపెనీలపై నిషేధం విధించాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది.

దేశంలో చైనా సంస్థలపై బ్యాన్ విధించాలనే డిమాండ్ల మేరకు రైల్వే శాఖ ఒక కాంట్రాక్టును రద్దు చేసింది. కాన్పూర్- దీన్‌దాయాల్ ఉపాధ్యాయ (మొఘల్ సరాయ్) సెక్షన్ల మధ్య 417 కిలోమీటర్ల మేర టెలీకమ్యునికేషన్స్, సిగ్నలింగ్ ప్రాజెక్టును 2016లో చైనాకు చెందిన బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యునికేషన్ సంస్థకు కేటాయించింది. ఈ మేరకు ఈ కాంట్రాక్టు రద్దు చేసినట్లు ఇండియన్ రైల్వేకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు బీసీసీఐ కూడా వీవోతో ఉన్న స్పాన్సర్‌షిప్ వదులుకోవాలని.. పేటీఎం, డ్రీమ్ ఎలెవెన్ కంపెనీలు కూడా తమ చైనా వాటాను వదులు కోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. కెప్టెన్ విరాట్ కొహ్లీ కూడా చైనాకు చెందిన ఐక్యూఓఓ సంస్థతో ఉన్న ఒప్పందం రద్దు చేసుకోవాలని పలువురు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.