తెలంగాణలో ఒకే రోజు 499 కరోనా పాజిటివ్ కేసులు

గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 499 కరోనా కేసులు నిర్థారణ అయ్యాయి. వీటిలో 329 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండటం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో మరో 129 కేసులు నమోదవ్వడంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 6,526కి చేరింది.

తెలంగాణలో శుక్రవారం 2,477 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,978 మందికి నెగెటివ్ వచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50,569 పరీక్షలు చేసినట్లు వైద్యారోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో ముగ్గురు కోవిడ్-19 కారణంగా చనిపోవడంతో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 198కి చేరింది. ఇక 51 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వాళ్ల సంఖ్య 3,352కి చేరింది.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా పరీక్షలను పెంచడంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే వారిలో చాలా మందిని ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉంచారు. ఆరోగ్య పరంగా విషమంగా ఉన్న వారిని మాత్రమే ఆసుపత్రుల్లో చేరుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,976 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు అధికారులు చెప్పారు.