మెగా అల్లుడు అస్సలు తగ్గట్లేదుగా

హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ తను నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. లెక్కప్రకారం.. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత తన సినిమానే ముందుగా సెట్స్ పైకి తీసుకురావాలని చిరంజీవి భావించారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆచార్య వాయిదాల పర్వం నడుస్తోంది. ఓవైపు చిరంజీవి ఇలా వెనక్కి తగ్గుతుంటే.. మరోవైపు చిరంజీవి అల్లుడు మాత్రం అస్సలు తగ్గడం లేదు.

అవును.. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సెట్స్ పైకి వచ్చేశాడు. ప్రస్తుతం సూపర్ మచ్చి అనే సినిమా చేస్తున్నాడు కల్యాణ్ దేవ్. ఫైనల్ షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండగా లాక్ డౌన్ పడింది. ఇప్పుడా షెడ్యూల్ ను కల్యాణ్ దేవ్ ప్రారంభించాడు. హైదరాబాద్ లో ఈరోజు సూపర్ మచ్చి ఫైనల్ షెడ్యూల్ మొదలైంది.

14 రోజుల్లో ఫైనల్ షెడ్యూల్ తో పాటు ప్యాచ్ వర్క్ ను పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మరోవైపు ప్రభుత్వ నిబంధనల్ని పాటిస్తూ అన్ని రకాల కరోనా నియంత్రణ చర్యలు తీసుకుని షూట్ స్టార్ట్ చేశారు.

నిజానికి కల్యాణ్ దేవ్ కు కూడా ఇప్పట్లో సెట్స్ పైకి రావాలని లేదు. కాకపోతే ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ జోరుగా సాగుతోంది. ఇతడు నటిస్తున్న సూపర్ మచ్చి సినిమాకు ఓటీటీలో మంచి రేటు వచ్చేలా ఉంది. అందుకే సినిమా షూట్ పూర్తిచేసి, ఫస్ట్ కాపీ రెడీ చేయాలని అనుకుంటున్నారు. కల్యాణ్ దేవ్ కంగారు వెనక అసలు కారణం ఇదే.