రీఎంట్రీపై స్పందించిన రేణు దేశాయ్

క్యారెక్టర్ ఆర్టిస్టుగా రేణు దేశాయ్ కు చాలా అవకాశాలొచ్చాయి. కానీ వేటినీ ఆమె అంగీకరించలేదు. దీంతో ఆఫర్ చేసే పాత్రలు ఆమెకు నచ్చలేదని కొందరు.. మళ్లీ ముఖానికి రంగేసుకునే ఉద్దేశం ఆమెకు లేదని మరికొందరు వాదించుకున్నారు. అలా హాట్ టాపిక్ గా మారిన రేణుదేశాయ్ ఎట్టకేలకు తన రీఎంట్రీ స్పందించారు. ఇన్నాళ్లూ ఎందుకు కెమెరా ముందుకు రాలేదో కూడా తెలిపారు.

రేణుదేశాయ్ కు నటించాలనే ఆసక్తి కంటే డైరక్షన్ చేయాలనే కోరికే ఎక్కువగా ఉందట. అందుకే ఇన్నాళ్లూ ఆమె తన వద్దకొచ్చిన పాత్రల్ని తిరస్కరిస్తూ వచ్చారట. పైగా ఇన్నేళ్ల తర్వాత తను మేకప్ వేసుకొని కెమెరా ముందుకొస్తే తెలుగు ప్రేక్షకులు ఏమంటారో అనే భయం కూడా రేణుకు ఉందట. ఈ వయసులో అవసరమా అంటూ ఎవరైనా కామెంట్ చేస్తే తట్టుకోలేనని, అందుకే మళ్లీ సినిమాల్లోకి రాలేదని ఆమె తెలిపారు.

అయితే రీసెంట్ గా జీ తెలుగు ఛానెల్ కు ఆమె ఓ యాడ్ చేశారు. ఆ ప్రోమో చేసిన తర్వాత నటిగా తనలో కాన్ఫిడెన్స్ పెరిగిందంటున్నారు రేణుదేశాయ్. చాలామంది ఆ యాడ్ చూసి తనను మెచ్చుకుంటున్నారని అంటోంది. కాబట్టి మంచి పాత్రలు దొరికితే ఈసారి వదులుకోనని, కెమెరా ముందుకొచ్చేంత ధైర్యం తనకు వచ్చిందని తెలిపింది రేణుదేశాయ్.