విశాల్ సినిమా ఓటీటీలోకి

నిన్ననే తన కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ అంటూ ఓ ట్రైలర్ రిలీజ్ చేశాడు విశాల్. అంతలోనే ఆ సినిమాపై పుకార్లు మొదలయ్యాయి. దీనికి చక్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా విశాల్ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. విశాల్ ఖండించకపోవడంతో ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చినట్టయింది.

విశాల్ హీరోగా ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చక్ర మూవీని.. తన సొంత బ్యానర్ పై విశాల్ నిర్మించాడు. శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో రెజీనా న‌టిస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పట్లో తమిళనాట థియేటర్లు తెరుచుకునే పరిస్థితులు కనిపించడం లేదు కాబట్టి, తన సినిమాను ఓటీటీకి ఇచ్చేయాలని అనుకుంటున్నాడట విశాల్.

ఇంతకుముందు సూర్య కూడా ఇలానే చేశాడు. తన భార్యను లీడ్ గా పెట్టి, తను నిర్మించిన పోన్మాగళ్ వందాల్ అనే సినిమాను ఓటీటీకి ఇచ్చేశాడు. ఇప్పుడు అదే దారిలో విశాల్ చక్ర మూవీ కూడా ఓటీటీకి వెళ్తుందని అంటున్నారు.

విశాల్ సూప‌ర్ హి‌ట్ మూవీ `అభిమ‌న్యుడు` త‌ర‌హా బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది.