Telugu Global
NEWS

జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఉండవల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక, మద్యం వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. కొద్దిరోజుల క్రితమే ఆవ భూముల గురించి ముఖ్యమంత్రికి లేఖ రాశానని.. కానీ గత ప్రభుత్వంలాగే ఇప్పుడు కూడా స్పందన రాలేదన్నారు. ఎకరం 45 లక్షలు చెల్లించారంటున్నారని… కానీ అక్కడ అంత విలువ ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. దీనిపై సీఎం నుంచి స్పందన వస్తుందనుకున్నామని కానీ రాలేదన్నారు. అన్నీ రూల్ ప్రకారమే చేశామని… మూడు […]

జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఉండవల్లి
X

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక, మద్యం వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు.

కొద్దిరోజుల క్రితమే ఆవ భూముల గురించి ముఖ్యమంత్రికి లేఖ రాశానని.. కానీ గత ప్రభుత్వంలాగే ఇప్పుడు కూడా స్పందన రాలేదన్నారు. ఎకరం 45 లక్షలు చెల్లించారంటున్నారని… కానీ అక్కడ అంత విలువ ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. దీనిపై సీఎం నుంచి స్పందన వస్తుందనుకున్నామని కానీ రాలేదన్నారు. అన్నీ రూల్ ప్రకారమే చేశామని… మూడు శాతం మాత్రమే ఎక్కువ చెల్లించామని మంత్రులు చెబుతున్నారని… కానీ ఏవిధంగా చూసుకున్నా ఎకరాకు 45లక్షలు చెల్లించే అవకాశం లేదన్నారు.

దీనిపై సమాచార హక్కు కింద కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టానన్నారు. దానికి సమాధానం వచ్చిందన్నారు. సబ్‌ కలెక్టర్‌కు పంపుతున్నట్టుగా సమాధానం ఇచ్చారన్నారు. అవినీతిరహిత పాలన అందిస్తానన్న జగన్‌మోహన్ రెడ్డి ఈ ల్యాండ్‌ విషయంలో సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ అవినీతి జరిగి ఉండకపోతే ఇంత రేటు చెల్లించే పరిస్థితి రావడం ప్రభుత్వ అసమర్థతే అవుతుందన్నారు. ఈ భూముల్లో ఇళ్లు కట్టుకుంటే రాజమండ్రికి వచ్చివెళ్లేందుకు చాలా ఖర్చు అవుతుందన్నారు. ఇలా దూరంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. అధికారంలోకి వచ్చింది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు అన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఆవ భూముల వ్యవహారం ముఖ్యమంత్రికి చెడ్డపేరు రావడం ఖాయమన్నారు.

నిడదవోలులో కూడా ఇళ్ల స్థలాల కోసం భూమిని సిద్ధం చేసేందుకు 24 లక్షలకు తొలుత కేటాయిస్తూ ఆర్డర్ ఇచ్చారని… ఆ తర్వాత అదే పనికి 66 లక్షలు ఇస్తూ ఆర్డర్ ఇచ్చారన్నారు. దీని వెనుక ఏం జరిగిందో తేల్చాల్సిందిగా ఏసీబీకి లేఖ రాస్తున్నట్టు చెప్పారు.

ఇసుక సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. ఇసుక బుక్ చేస్తే ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. అదే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సంప్రదిస్తే వెంటనే ఇసుక వస్తోందన్నారు. ఇసుక సమస్య వల్ల భారీగా భవన కార్మికులు ఇబ్బందిపడుతున్నారన్నారు. నిర్మాణ రంగం స్తంభించిపోతోందన్నారు. ఇసుక పక్కనే ఉన్న రాజమండ్రిలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉందన్నారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నారా అన్నది ఆలోచించుకోవాలన్నారు.

లిక్కర్‌ విషయంలో చాలా భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. లిక్కర్ ఇక్కడ ఎంతకు కొంటున్నారు… పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎంతకు కొంటున్నాయి అన్నది పరిశీలిస్తే ఏపీలో అత్యధిక ధరకు కొంటున్నారన్నారు. ఒక్కో లిక్కర్ కేసుకు ఇంత అని కమిషన్‌ తీసుకుని కొంటున్నారని ఆరోపించారు. ఒకవేళ కమిషన్‌ తీసుకోకుండానే లిక్కర్ అధిక ధరకు కొని ఉంటే అప్పుడు అది ప్రభుత్వ అసమర్థత అవుతుందన్నారు. దీనిపైనా సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేశానన్నారు.

ధరలు పెంచడం వల్ల లిక్కర్ వినియోగం తగ్గిపోయిందని ముఖ్యమంత్రి చెబుతున్నారని.. కానీ నిజం అది కాదన్నారు ఉండవల్లి. ధరలు విపరీతంగా పెంచేయడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి భారీగా తక్కువ ధర మద్యం రాష్ట్రంలోకి వచ్చేస్తోందన్నారు. రెండు బాటీళ్ళ వరకు మద్యం తీసుకొచ్చే అవకాశం ఉందని… దాన్ని అడ్డుపెట్టుకుని పక్క రాష్ట్రం వెళ్లిన ప్రతి ఒక్కరూ రెండుబాటీళ్లు తెచ్చుకుంటున్నారన్నారు. రేట్లు పెంచితే మద్యం లేకుండాపోతుందనుకోవడం భ్రమేనన్నారు. నాటుసారా ఇప్పుడు మళ్లీ పెరుగుతోందన్నారు. నాటుసారా లాక్‌డౌన్‌ సమయంలో 300 ఉండేదని… ఇప్పుడు 5వందలకు నాటు సారా కొంటున్నారన్నారు. దీనికి కారణం మద్యం ధర భారీగా పెరగడమేనన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్‌ లు ఇక్కడతప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండవన్నారు. బూమ్‌ బూమ్‌, జామ్ జామ్‌, ఆంధ్రా టాప్ అంటూ అమ్ముతున్నారని… ఇవన్నీ ఇక్కడే లోకల్‌లోనే తయారు చేస్తున్నారని ఉండవల్లి వివరించారు. ఎందుకు బ్రాండెండ్‌ కంపెనీల మద్యాన్ని ఏపీలోకి రానివ్వడం లేదని ప్రశ్నించారు. వైఎస్‌ కుమారుడిగా జగన్‌ అంటే తనకు అభిమానమేనని… కానీ ముఖ్యమంత్రిగా తనకు జగన్మోహన్ రెడ్డి ఏమీ దగ్గర కాదన్నారు. జగన్‌ను కూడా తప్పులపై ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు.

అధికారంలోకి వచ్చింది ప్రత్యర్థులను అణచివేయడానికి కాదు అన్న విషయాన్ని జగన్‌మోహన్ రెడ్డి గుర్తించుకోవాలన్నారు. కేవలం ప్రజలకు సేవ చేయడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై నేరుగా ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌ పెట్టడాన్ని ఉండవల్లి తప్పుపట్టారు. ఎన్నికల వాయిదా పడినట్టుగానే ఇప్పుడు అన్నీ వాయిదా పడ్డాయి కదా అని ప్రశ్నించారు. కోర్టులపై చేస్తున్న కామెంట్స్‌ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇష్టానుసారం కోర్టులపై పోస్టులు పెడితే కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా అని ప్రశ్నించారు. న్యాయమూర్తుల ఈగోను దెబ్బతీసి సాధించేది ఏమీ ఉండదన్నారు.

ప్రతి ఒక్కరితోనూ గొడవ పెట్టుకుంటామంటే అది అన్నిచోట్ల సాధ్యంకాదన్నారు. అందరూ దేవుడు ఉన్నాడు సరే అనుకుని మౌనంగా వెళ్లేందుకు ఎల్వీ సుబ్రమణ్యంలాగే ఉండరన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌, ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వారు కూడా ఉంటారన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద దృశ్యాలను రికార్డు చేసే వారు ఆయన మనుషులే ఉంటారని… అలాంటప్పుడు జగన్‌మోహన్ రెడ్డి కారు నుంచి విజయసాయిరెడ్డి దిగిపోయే దృశ్యాలు ఎలా బయటకు వచ్చాయని ప్రశ్నించారు. ఆ దృశ్యాలను ఎవరు చెబితే బయటకు లీక్ చేశారని ఉండవల్లి అనుమానం వ్యక్తం చేశారు. లీక్ చేసిన వ్యక్తిని ఎందుకు అలా చేశావు… ఎవరు చెబితే చేశావని ప్రశ్నించారా అని వ్యాఖ్యానించారు.

అధికారం శాశ్వతం అని మాత్రం భ్రమించవద్దని జగన్‌మోహన్ రెడ్డికి సూచించారు. ఈ ఏడాది జగన్‌ పేరుతో ఉన్న సంక్షేమ పథకాలకే 80వేల 556కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. సచివాలయ ఉద్యోగులకు నెలకు 180 కోట్లు జీతాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనికి తోడు ప్రభుత్వాన్ని నడపడానికి ఖర్చు వేరే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. దేశంలో ఇన్నివేల కోట్లు ప్రజలకు పంచిపెడుతున్న ప్రభుత్వం మరొకటి లేదని… అప్పులు కూడా చిక్కే పరిస్థితి లేదన్నారు.

First Published:  24 Jun 2020 2:18 AM GMT
Next Story