Telugu Global
NEWS

మాకు రూ. 150 కోట్ల పరిహారం చెల్లించండి " హైదరాబాద్ మెట్రో

కరోనా లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయాయి. తాజాగా గత మూడు నెలలుగా సేవలు నిలిపేసిన హైదరాబాద్ మెట్రో సంస్థ నిర్వహణ నష్టాన్ని ఎదుర్కుంటోంది. మెట్రో రైళ్లు డిపోలకే పరిమితం కావడంతో వాటిల్లిన రూ. 150 కోట్ల నష్టాన్ని చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఒక వేళ చెల్లించని పక్షాన కనీసం నిర్వహణ కాలాన్ని 6 నెలల పాటు పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు లేఖ రాసినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ, […]

మాకు రూ. 150 కోట్ల పరిహారం చెల్లించండి  హైదరాబాద్ మెట్రో
X

కరోనా లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయాయి. తాజాగా గత మూడు నెలలుగా సేవలు నిలిపేసిన హైదరాబాద్ మెట్రో సంస్థ నిర్వహణ నష్టాన్ని ఎదుర్కుంటోంది. మెట్రో రైళ్లు డిపోలకే పరిమితం కావడంతో వాటిల్లిన రూ. 150 కోట్ల నష్టాన్ని చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఒక వేళ చెల్లించని పక్షాన కనీసం నిర్వహణ కాలాన్ని 6 నెలల పాటు పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు లేఖ రాసినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ, ఈ విషయాన్ని ఎల్ అండ్ టీ, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ రెండూ అధికారికంగా వెల్లడించలేదు.

హైదరాబాద్‌లో ప్రస్తుతం నాగోల్-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్, ఎల్బీనగర్-మియాపూర్ రూట్లలో మెట్రో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రతీ నిత్యం దాదాపు 4.5 లక్షల మంది మెట్రో సర్వీసును ఉపయోగిస్తుండటంతో నెలకు రూ. 50 కోట్ల ఆదాయం వస్తోంది. లాక్‌డౌన్‌ లేకుండా ఉంటే ఇప్పటికల్లా బ్రేక్ ఈవెన్‌కు చేరుకునేదని మెట్రో అధికారులు అంటున్నారు. కానీ గత మూడు నెలలుగా మెట్రో రైళ్లు డిపోల్లోనే ఉంటున్నాయి. దీనికి తోడు మెట్రో స్టేషన్లు, డిపోలు, రైళ్ల నిర్వహణ, సిబ్బంది జీతాలు చెల్లింపుతో సంస్థకు నిర్వహణ వ్యయం భారంగా మారింది.

ప్రస్తుతం మెట్రో రైళ్లు ఎప్పుడు నడుస్తాయో తెలియని పరిస్థితి. మరోవైపు రైళ్లు నడపటం ప్రారంభించినా గతంలో ఉన్న ఆదరణ ఉంటుందా, భౌతిక దూరం వల్ల ఆక్యుపెన్సీ తగ్గితే నిర్వహణ మరింత భారంగా మారుతుందా అనేవి అధికారులను తొలిచేస్తున్న అనుమానాలు. ఈ నేపథ్యంలో తిరిగి అంతా కుదుటపడటానికి మరో నాలుగు నుంచి ఆరు నెలల సమయమైనా పడుతుంది. అందుకే పరిహారం కింద రూ. 150 కోట్లు లేదా 6 నెలల నిర్వహణ పొడిగింపు కోరుతున్నాయి.

గతంలో కూడా నిర్మాణ సమయంలో పెరిగిన వ్యయాన్ని చెల్లించాలని ఎల్ అండ్ టీ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ తర్వాత చర్చల ద్వారా సమస్య పరిష్కరించారు. మరి ప్రస్తుతం రాసిన లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

First Published:  24 Jun 2020 9:05 PM GMT
Next Story