వారం రోజులు బేగంబజార్ లాక్‌డౌన్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వారం రోజులుగా సగటున 800 కేసులు వరకు నమోదవడంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కరోనా భయంతో ప్రజలు పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రులకు భారీగా వస్తుండటంతో శాంపిల్స్ పేరుకొని పోతున్నాయి. దీంతో రెండు రోజుల పాటు శాంపిల్స్ సేకరణ నిలిపివేశారు.

ఇక హైదరాబాద్‌లో ప్రఖ్యాత బేగంబజార్‌ను వారం రోజుల పాటు మూసివేయాలని హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి హోల్ సేల్ మార్కెట్ నుంచి భారీగా కిరాణ, ఇతర వస్తువులు సరఫరా అవుతుంటాయి. కరోనా నేపథ్యంలో ఈ మార్కెట్‌ను జూన్ 28 (ఆదివారం) నుంచి జులై 5 వరకు స్వచ్ఛంధంగా మూసేస్తున్నట్లు వ్యాపారుల సంఘం ప్రకటించింది.

బేగంబజార్ పరిధిలో కరోనా సోకి వారం రోజుల పరిధిలో ఇద్దరు మరణించారు. ఇక్కడ 15కు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో వ్యాపారుల్లో ఆందోళన మొదలు కావడంతో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పూర్తి స్థాయి లాక్‌డౌన్ నిర్వహించడమే మేలని అనుకోవడంతో వెంటనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

లాక్‌డౌన్ కాలంలో ఎవరైనా వ్యాపారం చేసినా, దుకాణాలు తెరిచినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని, వారికి భారీ జరిమానా విధిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. మరోవైపు లాడ్‌బజార్‌ను కూడా మూసివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సికింద్రాబాద్‌లో కూడా..

వస్త్రదుకాణాలకు పెట్టింది పేరైన సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్ ప్రాంతంలో కూడా లాక్‌డౌన్ చేయాలని వస్త్ర వ్యాపారులు నిర్ణయించారు. ఈ నెల 26 నుంచి జులై 5 వరకు సికింద్రాబాద్ ప్రాంతంలోని అన్ని వస్త్ర దుకాణాలు మూసేస్తున్నట్లు చేసేత, సిల్కు, వస్త్ర దుకాణాల సంఘం అధ్యక్షుడు టి. అశోక్ కుమార్ తెలిపారు. ఇదే ప్రాంతంలో ఉన్న బంగారు, వెండి, వజ్రాల వ్యాపారులు కూడా లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక సూర్య టవర్స్, ప్యారడైజ్ పరిధిలో ఉన్న అన్ని రకాల వ్యాపారాలు మూసేయడానికి వ్యాపారులు ముందుకు వచ్చారు.