మళ్లీ రోడ్డెక్కిన దాసరి కుమారుల వివాదం

దాసరి నారాయణరావు కుమారుల ఆస్తి వివాదం మరోసారి రోడ్డెక్కింది. కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. దాసరి కుమారుడు ప్రభు… తన సోదరుడు అరుణ్‌ కుమార్‌పై జూబ్లిహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అరుణ్‌ కుమార్‌ ఈనెల 24న అక్రమంగా తన ఇంటిలోకి చొరబడ్డారని ఫిర్యాదు చేశారు. అరుణ్ కుమార్ గేటు దూకి ఇంట్లోకి చొరబడిన సీసీ ఫుటేజ్ దృశ్యాలను కూడా అందజేశాడు.

గేటు దూకి ఇంటిలోకి వచ్చిన అరుణ్ కుమార్ తన భార్యపైనా చేయి చేసుకున్నాడని… వెళ్లిపోవాలని చెప్పినందుకు తనతో పాటు తన మామను కూడా కొట్టాడని ప్రభు చెబుతున్నాడు. దాసరి నారాయణరావు ఇది వరకు ఉన్న గదిలోకి వెళ్లి బీరువాను పగలగొట్టేందుకు అరుణ్ కుమార్ ప్రయత్నించాడని ప్రభు చెబుతున్నాడు. తాగి వచ్చి నోటికొచ్చినట్టు తిట్టడంతో పాటు తన కుటుంబసభ్యులను కొట్టాడని ఫిర్యాదులో ప్రభు వివరించారు.

దాసరి నారాయణరావు తన మనవరాలు పేరున ఇంటిని వీలునామా రాశారని… ఈ వీలునామా ప్రకారమే తాము ఇంట్లో ఉంటున్నామని ప్రభు చెబుతున్నాడు. తక్షణం ఇంటిని ఖాళీ చేయకపోతే చంపేస్తానంటూ అరుణ్‌ కుమార్‌ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో వివరించాడు. ఆస్తి వివాద పరిష్కారం కోసం మోహన్ బాబు, మురళీమోహన్ వద్దకు వెళ్లినా వారు కూడా ఏమీ చేయలేకపోతున్నారని ప్రభు చెబుతున్నాడు. తన కంటే ఎక్కువ వాటాలను అరుణ్ కుమారే తీసుకున్నాడని ప్రభు చెబుతున్నాడు.