సెల్ఫీ వీడియో రికార్డు చేసి వివాహిత ఆత్మహత్య… వెలుగులోకి దాడి దృశ్యాలు

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియో రికార్డు చేసి అనంతరం ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. శంషాబాద్ రాళ్లగూడలో ఈ ఘటన జరిగింది.

లావణ్యకు ఎనిమిదేళ్ల క్రితం వెంకటేశంతో వివాహం జరిగింది. వెంకటేశం జెట్ ఎయిర్‌వేస్‌లో పైలట్‌గా పనిచేస్తున్నారు. భారీగా కట్నం ఇచ్చి వివాహం చేశారు. అయితే పిల్లలు పుట్టడం లేదంటూ లావణ్యను కొన్నేళ్లుగా వేధిస్తూ ఉన్నాడు. మరో వివాహం చేసుకుంటానంటూ బెదిరించేవాడు. మరో వివాహం చేసుకోకుండా ఉండాలంటే కోటి రూపాయలు అదనపు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

ఇంతలోనే చెన్నైకు చెందిన ఒక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి లావణ్య నిలదీయగా ఆమెపై చిత్రహింసలు మరింత పెరిగాయి. లావణ్యను ఇంట్లో వెంకటేశం విచక్షణరహితంగా కొడుతున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. వెంకటేశం లావణ్యను కొడుతున్న సమయంలో పెంపుడు కుక్క అడ్డుపడే ప్రయత్నం చేసింది. అయినా వెంకటేశం ఏమాత్రం దయ లేకుండా లావణ్యను విచక్షణరహితంగా కొట్టాడు.

ఇలా వేధింపులు మరింత ఎక్కువైపోవడంతో లావణ్య సెల్ఫీ వీడియో రికార్డు చేసి తన చావుకు భర్తే కారణమని చెప్పి ఆత్మహత్య చేసుకుంది. ‘‘వాడి మీద ప్రేమ ఉంది.. అందుకే సూసైడ్‌ చేసుకుంటున్నాను. వాడు చేసేవి తట్టుకోలేక చనిపోతున్నాను. ఒకసారి ప్రేమిస్తే చచ్చేవరకు ప్రేమించాలని అనుకున్నాను. నేను తప్పులు చేసి రియలైజ్‌ అయ్యాను. కానీ, వాడు అవ్వటం లేదు… ’’ అంటూ ఆఖరి వీడియోలో వివరించింది లావణ్య.

తన కుమార్తె చావుకు కారణమైన వెంకటేశంను కఠినంగా శిక్షించాలని లావణ్య తండ్రి డిమాండ్ చేశారు. ‘ఎనిమిదేళ్లుగా నా కూతురిని అల్లుడు చిత్రహింసలకు గురి చేశాడు. మేం ఎక్కడ బాధపడతామో అని తను ఏనాడు మా దృష్టికి తీసుకురాలేదు. గతంలో లావణ్య గర్భవతిగా ఉన్న సమయంలో కడుపుపై తన్నడంతో అబార్షన్ కూడా అయింది. ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుని నా కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడు. వెంకటేశం చెన్నైకి చెందిన ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. లక్షల కొద్ది కట్నం కింద తీసుకున్నాడు. మాకు జరిగిన అన్యాయం ఏ తల్లిదండ్రులకూ జరగొద్దు. వెంకటేశంను బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలి’’అని లావణ్య తండ్రి ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు.