అచ్చెన్నాయుడే చేయించారు…

ఈఎస్‌ఐ కుంభకోణంలో నిందితుల నుంచి కీలక విషయాలను ఏసీబీ రాబట్టింది. కోర్టు అనుమతితో నిందితులను పోలీసు కస్టడీలో విచారించారు. నిందితులు, ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు విచారణలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరును చెప్పారు.

అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫార్సు లేఖ ఆధారంగానే, ఆయన చేసిన ఒత్తిడి కారణంగానే టెలీ హెల్త్ సర్వీసెస్ సేవలు, మందులు, పరికరాల కొనుగోలు జరిగినట్టు రమేష్ కుమార్‌, విజయకుమార్‌ వెల్లడించారు. అచ్చెన్నాయుడు ఎలా ఒత్తిడి చేశారు… ఏ విధంగా కొనుగోళ్లు జరిగాయి అన్న వివరాలను పూర్తిగా వివరించేశారు.

అటు అచ్చెన్నాయుడిని కూడా ఏసీబీ అధికారులు జీజీహెచ్‌లోని ప్రత్యేక వార్డులో ప్రశ్నించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రశ్నల వర్షం కురిపించారు. సిఫార్సు లేఖలు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పకుండా తలదించుకుని ఉండిపోయినట్టు చెబుతున్నారు.

సిఫార్సు లేఖలు ఇచ్చింది మాత్రం నిజమేనని అంగీకరించారు. మరికొన్ని ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు అచ్చెన్నాయుడు. వైద్యులు, లాయర్ల సమక్షంలోనే అచ్చెన్నాయుడిని విచారించారు.