ఇల్లు ముగ్గురిది… కొరియర్ కోసమే గోడ దూకా…

దాసరి నారాయణ రావు కుమారుల మధ్య ఆస్తి వివాదం తలెత్తింది. తన సోదరుడు అరుణ్‌ కుమార్ గోడ దూకి వచ్చి తనపై దాడి చేశారంటూ దాసరి ప్రభు ఆరోపణలు చేసిన నేపథ్యంలో దాసరి అరుణ్‌ మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుతం ప్రభు ఉంటున్న ఇల్లు ఆయన ఒక్కడిదే కాదని అరుణ్ కుమార్ చెప్పారు. తమ మధ్య ఆస్తి వివాదం ఉన్న మాట వాస్తవమేనని అరుణ్ కుమార్ వివరించారు.

ఆ ఇంటిపై తనకు, తన సోదరికి, తన సోదరుడికి ముగ్గురికీ హక్కు ఉందన్నారు. మనవరాలు పేరు మీద దాసరి నారాయణరావు వీలునామా రాసి ఉంటే దాన్ని చూపించాలని అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. తాను కొన్ని ఆస్తులు అమ్మినట్టు ప్రభు ఆరోపణలు చేశారని… కానీ తాను ఎలాంటి ఆస్తి అమ్మలేదని… అందుకు ఆధారాలు ఉంటే ప్రభు చూపించాలని అరుణ్ కుమార్ సవాల్ చేశారు.

తన అడ్రస్‌ కూడా ప్రభు ఉంటున్న ఇంటి పేరుతో ఉందన్నారు. ఇటీవల ఆ ఇంటికి ఒక కొరియర్ రావడంతో దాన్ని తీసుకునేందుకు తాను అక్కడికి వెళ్లానన్నారు. అర గంట పాటు బెల్ కొట్టినా గేటు తీయలేదని… అందుకే గోడ దూకి వెళ్లానని చెప్పారు. తన ఇంటి గేటు తాను దూకి వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు.

మద్యం తాగి వెళ్లినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మద్యం తాగి ఉంటే అంత పెద్ద గేటు దూకినప్పుడు పడిపోకుండా ఉంటానా అని ప్రశ్నించారు. తాను కొరియర్లో వచ్చిన డాక్యుమెంట్ తీసుకునేందుకు వెళ్తే పోలీసులకు ప్రభు ఫోన్ చేశారని అరుణ్ కుమార్ చెబుతున్నారు. పోలీసులు ఉండగానే తాను అక్కడి నుంచి డాక్యుమెంట్ తీసుకుని వచ్చేశానన్నారు.

తాను చేసిన తప్పేంటో చెప్పకుండా పదేపదే మీడియాకు ఎక్కితే ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. కోర్టు ఆర్డర్, వీలునామా ఉంటే చూపించాలన్నారు. ఇల్లు తనకు, తన సోదరి, తన సోదరుడు ముగ్గురికి చెందుతుందన్నారు.

ఆ ఇల్లు కూడా ముగ్గురికి తెలియకుండా ఎవరూ అమ్మడానికి వీల్లేదని ఇంజెక్షన్ ఆర్డర్‌ కూడా ఉందన్నారు. తనకు, తన సోదరికి మరో ఇల్లు ఉంది కాబట్టి అక్కడ ఉంటున్నామని… తన సోదరుడికి ఇల్లు లేదు కాబట్టి ఈ ఇంటిలో ఉంటున్నారని… అంత మాత్రానికే అతడిది అయిపోతుందా అని అరుణ్‌ కుమార్ ప్రశ్నించారు.

చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేస్తూ పదేపదే మీడియాకు ఎక్కడం అలవాటుగా మారిందన్నారు. ఏదో డిప్రెషన్‌లో ఉండి ఇలా వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తోందన్నారు. సినిమా పెద్దలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తే అభ్యంతరం లేదన్నారు.

తనకు ఎలాంటి అభ్యంతరాలు, సమస్యలు లేవన్నారు. సమస్యలు ఉందని చెప్పుకుంటున్నది తన సోదరుడేనన్నారు. చిన్న విషయానికి రోడ్డు మీద పడే పరిస్థితి తెచ్చారన్నారు. దాసరి నారాయణరావు ఎన్నో సమస్యలను పరిష్కరించారని… అలాంటిది తాము ఇలా రోడ్డున పడడం బాధగా ఉందన్నారు.