తెలంగాణలో అతి తక్కువ టెస్టులు

కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న సమయంలో దేశంలో అతి తక్కువ టెస్టులు చేస్తున్న జాబితాలో తెలగాణ చేరింది. జార్ఖండ్, ఒడిషా వంటి రాష్ట్రాలు తెలంగాణ కంటే అధికంగా కరోనా టెస్టులు చేస్తుండగా.. ఒక్క బీహార్ మాత్రమే తెలంగాణ కంటే తక్కువ టెస్టులు చేస్తోంది. ప్రతీ పది లక్షల మందికి చేస్తున్న టెస్టుల గణాంకాలను పోల్చి చూడగా ఈ వ్యత్యాసం సులభంగా తెలిసిపోతోంది.

తెలంగాణలో ప్రతీ పదిలక్షల మందికి 1,713 టెస్టులు చేస్తుండగా, బీహార్‌లో 1,424 టెస్టులు చేస్తున్నారు. జార్ఘండ్‌లో 3,374 టెస్టులు చేస్తుండగా ఇక్కడ 1.73 పాజిటివిటీ రేటు ఉంది. ఒడిషాలో 5,059 టెస్టులు చేస్తుండగా ఇక్కడ 2.44 పాజిటివిటీ రేటు ఉంది. ఇక పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 14,407 టెస్టులు చేస్తుండగా అక్కడ పాజిటివిటీ రేటు తక్కువగానే ఉంది.

కాగా, ఇతర రాష్ట్రాల్లో ర్యాపిడ్ టెస్టులు చేస్తుండగా.. తెలంగాణలో మాత్రం ఐసీఎంఆర్ ఆమోదించిన ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ టెస్టులు అత్యంత ఖచ్చితత్వం కలిగి ఉంటాయని తెలంగాణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారని.. వీటిలో రోగ నిర్థారణ ఖచ్చితత్వం 30 శాతం కంటే తక్కువగా ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అనంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే టెస్టుల సంఖ్యను రోజుకు 10వేలకు పెంచబోతున్నదని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు, ఇతర ల్యాబ్స్ తాము చేసిన టెస్టుల వివరాలను అప్‌డేట్ చేయట్లేదని.. అందుకే గణాంకాల్లో తెలంగాణ వెనుకబడినట్లు చూపుతున్నదని ఈటెల రాజేందర్ అంటున్నారు. ఇతర రాష్ట్రాలు, మెట్రో నగరాలతో పోలిస్తే మనం ఎంతో మెరుగ్గా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.

ఇక్కడ రికవరీ రేటు 41 శాతం, మరణాల రేటు 2.15 శాతంగా ఉందని… కరోనా బారిన పడిన ఎంతో మంది కోలుకున్నారని ఆయన చెబుతున్నారు. కోలుకున్న వారిలో డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నారని ఆయన చెప్పారు. టెస్టులు అధిక సంఖ్యలో నిర్వహించడానికి కోబాస్ – 8800 మెషిన్ తెప్పిస్తున్నామని అన్నారు. తొలి మెషిన్ మన రాష్ట్రానికే రావల్సి ఉండగా దాన్ని పశ్చిమ బెంగాల్‌కు తరలించినట్లు ఆయన చెప్పారు. ఆ మెషిన్ కనుక వస్తే రోజుకు 4 వేల టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉంటుందని అన్నారు.