పుకార్లకు చెక్… తెలుగు నేర్చుకుంటున్న అలియా

లాక్ డౌన్ కారణంగా హీరోహీరోయిన్ల కాల్షీట్లన్నీ చెల్లాచెదురయ్యాయి. ఒకే సినిమాకు కమిట్ అయిన రామ్ చరణ్, మహేష్ లాంటి హీరోలకు ఏం కాదు కానీ 2-3 సినిమాలకు కాల్షీట్లు ఇచ్చే హీరోయిన్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది. షూటింగ్స్ మొదలైన వెంటనే ఏ సినిమాకు కాల్షీట్లు కేటాయించాలనే తలనొప్పి వీళ్లకు ఎక్కువైంది. ఇందులో భాగంగా కాల్షీట్లు కేటాయించలేక, ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి అలియా భట్ తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్టు. ఈ సినిమాకు సంబంధించి అలియాభట్ చాలా కాల్షీట్లు కేటాయించాల్సి ఉంది. పైగా రాజమౌళి మేకింగ్ స్టయిల్ ఎలా ఉంటుందంటే, అతడికి నటీనటుల బల్క్ కాల్షీట్లు కావాలి. ఎందుకంటే, షూటింగ్-ఎడిటింగ్-రీషూట్ ఇలా ఒకదాని వెంట ఒకటి అతడు చేస్తూనే ఉంటాడు.

సో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ కు అలియా భట్ కాల్షీట్లు కేటాయించే పరిస్థితి లేదు కాబట్టి ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని అంతా అనుకున్నారు. అయితే ఈ పుకార్లకు తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది అలియా భట్.

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అలియాభట్ తెలుగు నేర్చుకుంటోంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆమె ఆర్ఆర్ఆర్ కోసం ఇలా హోమ్ వర్క్ స్టార్ట్ చేసింది. సో.. ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.