శ్యామ్ కె నాయుడుకు కొత్త కష్టాలు

కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు పేరు ఈమధ్య మారుమోగిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ నటి సాయిసుధ, శ్యామ్ పై పోలీసులకు ఫిర్యాదుచేసింది. వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. అప్పట్లో బెయిల్ తెచ్చుకున్న శ్యామ్ కె నాయుడుకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది.

వ్యవహారం కోర్టుకు వెళ్లిన వెంటనే శ్యామ్ కె నాయుడు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నాడు. సాయిసుధతో తాను రాజీకొచ్చానని, బెయిల్ ఇప్పించమని అర్థించాడు. అలా రిమాండ్ లోకి వెళ్లిన 2 రోజులకే ఆయనకు బెయిల్ లభించింది. అయితే కోర్టుకు సమర్పించిన ఆ పత్రాలు నకిలీవని సాయిసుధ కోర్టుకు చెప్పింది.

పత్రాల్ని పరిశీలించిన కోర్టు శ్యామ్ కె నాయుడు బెయిల్ తక్షణం రద్దయినట్టు ప్రకటించింది. అంతేకాకుండా.. నకినీ పత్రాలు సమర్పించినందుకు గాను సదరు సినిమాటోగ్రాఫర్ పై ఫోర్జరీ కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించింది.

దీంతో శ్యామ్ కె నాయుడు కష్టాలు రెట్టింపు అయ్యాయి. మొన్నటివరకు సాయిసుధతోనే సమస్య అనుకుంటే ఇప్పుడు ఫోర్జరీతో ఏకంగా కోర్టునే మోసం చేశాడనే అభియోగాన్ని ఆయన ఎదుర్కోబోతున్నారు.