రొమాంటిక్ గా ఓటీటీలోకి

అన్ లాక్ లో భాగంగా ఆంక్షలు సడలిస్తున్నప్పటికీ థియేటర్ల విషయంలో మాత్రం ఇంకా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో కూడా థియేటర్లు తెరుచుకునేది కష్టమే, తెరిచినా సగం కంటే తక్కువ ఆక్యుపెన్సీతో సినిమాలు ఆడించాలి. పైగా రిలీజ్ డేట్స్ కూడా దొరకడం కష్టం.

దీంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి చేరేందుకు పూరి జగన్నాధ్ కొడుకు సినిమా కూడా రెడీ అవుతున్నట్టు టాక్.

పూరి కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమాకు దర్శకుడు వేరే వ్యక్తి అయినప్పటికీ.. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ పూరి జగన్నాధ్ వే. అందుకే ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. లాక్ డౌన్ కు ముందే దాదాపు 80శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఓటీటీకి ఇవ్వాలని పూరి జగన్నాధ్ అనుకుంటున్నాడట.

ఆకాష్ కు థియేట్రికల్ మార్కెట్ లేదు. ఇంతకుముందు తండ్రి దర్శకత్వంలో అతడు చేసిన మెహబూబా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు రొమాంటిక్ అనే సినిమాను రిలీజ్ చేసినా బిజినెస్ అవుతుందనే గ్యారెంటీ లేదు. అందుకే ఫస్ట్ కాపీ రెడీ చేసి ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీకి ఇచ్చేయాలని పూరి-చార్మి (నిర్మాతలు) అనుకుంటున్నారట. ఈ మేరకు ఇప్పటికే వీళ్లు చర్చలు కూడా ప్రారంభించినట్టు సమాచారం.