Telugu Global
International

యాప్‌ల నిషేధంపై చైనా స్పందన

భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్‌ని నిషేధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఈ నిషేధాన్ని సడలించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత ప్రభుత్వం వివక్షను చూపిస్తోందని, ఇది పారదర్శకమైన వాణిజ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోందని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నామని, ఏ దేశంలో వ్యాపారం చేస్తే ఆ దేశ చట్టాలు, నియమ నిబంధనలు పాటించాలని తమ కంపెనీలకు చెబుతుంటామని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి […]

యాప్‌ల నిషేధంపై చైనా స్పందన
X

భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్‌ని నిషేధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఈ నిషేధాన్ని సడలించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత ప్రభుత్వం వివక్షను చూపిస్తోందని, ఇది పారదర్శకమైన వాణిజ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోందని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నామని, ఏ దేశంలో వ్యాపారం చేస్తే ఆ దేశ చట్టాలు, నియమ నిబంధనలు పాటించాలని తమ కంపెనీలకు చెబుతుంటామని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఝి రోంగ్ ఆ ప్రకటనలో తెలిపారు. ఇండియా కూడా నిబంధనలకు అనుగుణంగా చైనా సహా ఇతర అంతర్జాతీయ పెట్టుబడిదారుల హక్కులను పరిరక్షించాలని ఆయన ప్రకటనలో తెలిపారు.

భారత్ నిషేధించిన చైనా యాప్స్‌కు ఎంతో మంది యూజర్లు ఉన్నారని, ఇక్కడ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తున్నాయని.. ఈ నిషేధం వల్ల ఎంతో మంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని చైనా పేర్కొంది. ఎంతో మంది భారత కళాకారులు, వ్యాపారులు, ఉద్యోగులు ఈ యాప్స్ తమ వృత్తిలో భాగంగా వాడుతున్నారని.. కానీ ఇప్పుడు వారి జీవనోపాధి కోల్పోయే ప్రమాదం పడిందని చైనా వ్యాఖ్యానించింది.

ఇండో-చైనా వ్యాపార, వాణిజ్య ఒప్పందాలకు తూట్లు పొడవకుండా, భారత ప్రభుత్వం ఈ నిర్ణయంపై మరోసారి సమీక్షించాలని కోరింది. ఇది ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటోంది. భారత సార్వభౌమత్యం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు ముప్పు పొంచి ఉండటంతో సోమవారం 59 చైనా యాప్‌లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నిషేధించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ యాప్స్ పని చేయడం మానేశాయి.

టిక్ టాక్ స్పందన

ప్రభుత్వం నిషేధించిన యాప్‌లలో భారీ సంఖ్యలో యూజర్లు ఉన్న యాప్ టిక్ టాక్. ప్రపంచంలో టిక్ టాక్‌కు అత్యధిక యూజర్లు ఉన్నది ఇండియాలోనే. ప్రస్తుతం నిషేధం విధించడంతో ఈ యాప్ అందుబాటులో లేకుండా పోయింది. దీనిపై టిక్ టాక్ స్పందించింది.

భారత చట్టాలను మేం పూర్తిగా గౌరవిస్తున్నామని, ఈ యాప్ ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదని పేర్కొంది. చైనాతో సహా ఇతర ఏ దేశానికి మా వినియోగదారుల సమాచారాన్ని అందించలేదని స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు, భవిష్యత్‌లో కూడా మా వినియోగదారుల సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోయమని టిక్ టాక్ చెప్పింది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యతకే పెద్ద పీఠ వేస్తున్నామని సంస్థ తెలిపింది.

First Published:  30 Jun 2020 7:42 PM GMT
Next Story