వాటర్‌ గ్రిడ్‌ టెండర్లు పూర్తి చేయండి – మంత్రి పెద్దిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న వాటర్ గ్రిడ్ మొదటి దశ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

గ్రామీణ నీటి సరఫరా, వాటర్‌ గ్రిడ్ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి… ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

తాగునీటి విషయంలో ఎమ్మెల్యేల నుంచి వచ్చే వినతులపై తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాచురేషన్ మోడ్‌లో అధికారులు పనులు చేయాలన్నారు. వాటర్ గ్రిడ్‌ కోసం నిధుల సమీకరణపైనా చర్చించారు. జల్‌ జీవల్‌ మిషన్‌, నాబార్డ్ నుంచి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు.

12వేల 308 కోట్లతో మొదటి దశ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపడుతున్నట్టు చెప్పారు. శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ప్రకాశం, గుంటూరు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లో వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా వాటర్‌గ్రిడ్‌ పనులు ప్రారంభించి పూర్తిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణం, పురోగతిని మంత్రికి అధికారులు వివరించారు. పంచాయితీ రాజ్‌ విభాగంలో మన బడి, నాడు- నేడు కింద 283 మండలాల్లో 25,484 పనులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

స్కూల్స్‌ ప్రారంభమయ్యే లోపు ఆ పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్‌ హెల్త్ క్లినిక్స్ , గ్రామ సచివాలయాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని… నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సమీక్ష సమావేశంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.