మరో సినిమా ఓకే చేసిన శర్వా

హీరో శర్వానంద్ చేతిలో ప్రస్తుతం ఓ సినిమా ఉంది. దాని పేరు శ్రీకారం. లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా కూడా లేదు. దీంతో పాటు అజయ్ భూపతి దర్శకత్వంలో రాబోతున్న మహాసముద్రం సినిమాలో కూడా నటించేందుకు ఒప్పుకున్నాడు ఈ హీరో. సో.. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఈ రెండు సినిమాల్ని అతడు పూర్తిచేస్తాడని అంతా అనుకున్నారు. కానీ శర్వానంద్ అప్పుడే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు శర్వా ఒప్పుకున్నాడు. గతంలో చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ సినిమాలతో మెప్పించిన కిషోర్ తిరుమల.. ప్రస్తుతం రామ్ తో రెడ్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే శర్వానంద్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు ఈ దర్శకుడు.

ఈ లాక్ డౌన్ టైమ్ లో శర్వానంద్ ఏం చేశాడనే ప్రశ్నకు తాజా ప్రకటనతో సమాధానం దొరికేసింది. శర్వా-కిషోర్ తిరుమల కలిసి తమ కొత్త సినిమా స్టోరీ డిస్కషన్లు పూర్తిచేశారన్నమాట. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీకి సంబంధించి కిషోర్ తిరుమల దాదాపు స్క్రీన్ ప్లే వెర్షన్ వరకు వెళ్లిపోయాడని టాక్.