హైదరాబాద్‌లో నో లాక్‌డౌన్

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ పరిధిలో నిత్యం 800 పైగా కేసులు నమోదవుతుండటంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందారు.

జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కనీసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయినా లాక్‌డౌన్ విధించాలని జీహెచ్ఎంసీ అధికారులు సీఎం కేసీఆర్‌కు సూచించారు.

కాగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో లాక్‌డౌన్ లేనట్లే అని తెలియజేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ మార్గదర్శకాలకు అనుగుణంగా విడుదల చేసిన ఈ జీవోలో ఎక్కడా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు చెప్పలేదు.

ప్రతీ రోజు రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు కర్ఫ్యూ మాత్రం ఉంటుందని చెప్పింది. ఈ వారంలో క్యాబినెట్ భేటీ నిర్వహించి, లాక్‌డౌన్‌పై ఒక నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎలాంటి కేబినెట్ సమావేశం నిర్వహించట్లేదని సమాచారం.

రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, పబ్, క్లబ్‌లు, సినిమా థియేటర్లు, బార్లు అన్నీ మూసే ఉంచాలని.. గతంలో మినహాయింపు ఇచ్చిన వ్యాపారాలు మాత్రం చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. కంటైన్ మెంట్ జోన్లలో మాత్రం కరోనా కట్టడి చర్యలు కొనసాగుతాయని చెప్పింది.

అయితే హైదరాబాద్‌లో కేసులు విపరీతంగా పెరుగుతున్నా.. మరణాల రేటు తక్కువగా ఉండటం వల్లే లాక్‌డౌన్ అవసరం లేదని తేల్చినట్లు సమాచారం. కరోనా టెస్టులు పెంచుతుండటంతోనే సంఖ్య ఎక్కువగా వస్తోందని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు.

మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే… గాడిన పడుతున్న ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలు తప్పుతుందని… కాబట్టి యధాతథ స్థితినే కొనసాగించమని సూచనలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను విడుదల చేసింది.