అక్కడ రోబోలే నర్సులు

దేశంలో కరోనా మహమ్మారి నానాటికీ పెరిగిపోతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా టెస్టుల సంఖ్యను పెంచడంతో పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరగడంతో సిబ్బంది కొరత తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అంతే కాకుండా ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కూడా కోవిడ్-19 బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 కోసం ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేసినా, అక్కడ పని చేయడానికి సిబ్బంది ముందుకు రావడం లేదు. కరోనా సోకితే తమతో పాటు కుటుంబానికి కూడా ప్రమాదకరమని భావిస్తుండటంతో వైద్య సేవలు చేసే నిపుణులు కరువయ్యారు. దేశంలో కరోనా కేసులు తొలి సారిగా గుర్తించింది కేరళలోనే. ఇక్కడ కూడా కరోనా రోగుల కోసం అనేక హెల్త్ సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కాగా, రాష్ట్రంలోని ఎరవిపెరూర్ గ్రామ పంచాయితీలో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక ఆశా వర్కర్ కరోనా బారిన పడి మృతి చెందింది. దీంతో గ్రామ పంచాయితీ ఉప సర్పంచ్ ఎన్. రాజీవ్ హెల్త్ వర్కర్లు, నర్సులకు ఎలాంటి హానీ కలుకకుండా ఉండేలా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కేరళలో సమూహ వ్యాప్తి పెరుగుతున్న దశలో ఆరోగ్య కార్యకర్తలకు తీవ్ర ముప్పుందని గ్రహించి రోబో నర్సులకు రూపకల్పన చేశారు.

తిరుచిరాపల్లి కేంద్రంగా ప్రొపెల్లర్ టెక్నాలజీన్ అనే ఐటీ కంపెనీ పని చేస్తోంది. ఈ కంపెనీ సహకారంతో నాలుగడుగుల పొడవైన రెండు రోబో నర్సులను తయారు చేయించారు. ఈ రోబో నర్సులు బెడ్లపై దుప్పట్లు మార్చడం, రోగికి ఔషధాలు ఇవ్వడం, వారికి ఆహారాన్ని తీసుకెళ్లడం వంటి పనులన్నీ చేస్తాయి.

ఆసుపత్రిలోని ప్రతీ గదికి వెళ్లి రోగులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తుంటాయి. ఆశ అని పేరు పెట్టిన ఈ రోబోలు పేషెంట్ బంధువులతో కూడా మాట్లాడతాయని, రెండు రోబోలను పూర్తి స్థాయిలో పరీక్షించామని రాజీవ్ తెలిపారు. ఒక్కో రోబో తయారీకి రూ. 90 వేల ఖర్చయినట్లు ఆయన చెప్పారు.

కేరళలోని తిరువల్ల తాలూకాలో ఉన్న ఈ ఎరవిపెరూర్ గ్రామ పంచాయితీ చాలా సార్లు వార్తల్లో కెక్కింది. ప్రజా పరిపాలనలో జాతీయ అవార్డు అందుకున్న తొలి గ్రామ పంచాయితీగా నిలిచింది. అంతే కాకుండా 2015లో ఐఎస్ఓ-9001 సర్టిఫికేషన్ పొందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కల్గిన గ్రామ పంచాయితీగా కూడా రికార్డు సృష్టించింది.