నితిన్ పెళ్లికి డేట్ ఫిక్స్

నితిన్ పెళ్లికి తేదీ ఖరారైంది. ఈనెల 26న తన ప్రేయసి షాలిని మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు ఈ హీరో. హైదరాబాద్ లోని ఓ రిసార్ట్ లో, లాక్ డౌన్ నిబంధనల మేరకు అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో నితిన్ పెళ్లి జరగబోతోంది.

నిజానికి కాస్త ఆర్భాటంగానే పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు నితిన్. అందుకే లాక్ డౌన్ లో పెళ్లి చేసుకోనంటూ ఆమధ్య ప్రకటించాడు. నిఖిల్ పెళ్లి చేసుకున్న తర్వాత తన పెళ్లిపై కూడా పుకార్లు రావడంతో నితిన్ అప్పట్లో అలా క్లారిటీ ఇచ్చాడు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. కానీ ఆ సాధారణ పరిస్థితులు దరిదాపుల్లో కనిపించేలా లేవు. అందుకే నితిన్ ఇలా “లాక్ డౌన్ పెళ్లి”కే ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది.

లెక్కప్రకారం ఏప్రిల్ లో నితిన్ పెళ్లి జరగాలి. దుబాయ్ లో భారీగా పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అంతలోనే లాక్ డౌన్ వల్ల పెళ్లి ఆగిపోయింది. అలా ఆగిపోయిన పెళ్లి ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉండడంతో, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నితిన్ ఇలా గుంభనంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు.