టిక్‌టాక్‌కు మరో ఎదురు దెబ్బ

ఇండో-చైనా ఘర్షణల నేపథ్యం, భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలతో కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ 59 చైనా యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. కాగా, ఆయా యాప్‌ ల విషయంలో తమ వాదనలను సుప్రీంకోర్టులో వినిపించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది. దీంతో తమ తరపున వాదనలు వినిపించమని టిక్‌టాక్ యాజమాన్యం ప్రముఖ న్యాయవాది, మాజీ అటార్ని జనరల్ ముఖుల్ రోహత్గీని సంప్రదించింది.

భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చైనా సంస్థకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానంలో వాదించబోనని ఆయన టిక్ టాక్‌కు స్పష్టం చేశారు. దీంతో తమ తరపున వాదించేందుకు మరో న్యాయవాదిని వెతికే పనిలో పడింది.

మరోవైపు టిక్‌టాక్‌పై నిషేధంతో సంస్థలోని ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ సీఈవో కెవిన్ మేయర్ ఇండియాలోని ఉద్యోగులకు బుధవారం ఒక లేఖ రాశారు.

టిక్‌టాక్ ఇంటర్నెట్‌లో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దిశగా తమ నిబద్దతకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. దేశంలోని 20 కోట్ల మందికి పైగా యూజర్లు తమ కళను బయటి ప్రపంచానికి తెలియపరిచే వీలును టిక్ టాక్ కల్పించిందని అన్నారు.

ఈ కష్ట కాలంలో ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని, చట్ట పరంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తాజా పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయి, ఉద్యోగులు కూడా జాబ్ సెక్యూరిటీ గురించి ఆందోళన చెంద వద్దని ఆయన పేర్కొన్నారు.