నాని సినిమాపై ఆగని పుకార్లు

చూస్తుంటే.. మంచి రేటు కోసం దిల్ రాజు వెయిట్ చేస్తున్నట్టుంది. నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన V సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయలేకపోయాడు దిల్ రాజు. సరిగ్గా ఈ సినిమా రిలీజ్ కు కొన్ని రోజుల ముందు థియేటర్లు బంద్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే లాక్ డౌన్ వల్ల ఎఫెక్ట్ అయిన మొట్టమొదటి సినిమా ఇదే.

అలాంటి సినిమాను ఇక ఎక్కువ రోజులు తన దగ్గర పెట్టుకోవాలని అనుకోవడం లేదు దిల్ రాజు. థియేటర్లు ఓపెన్ అవుతాయని ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఈ బడా నిర్మాత, ఈసారి ఓటీటీ వైపు సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే నెలలో థియేటర్లు ఓపెన్ అయినా పరిస్థితి గడ్డుకాలమే.

ఇందులో భాగంగా V మూవీ కోసం అమెజాన్ ప్రైమ్ 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అటు ఆహా యాప్ కోసం అల్లు అరవింద్ ఈ సినిమాకు 30 కోట్లు ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే వాస్తవం ఏంటంటే.. ప్రస్తుతం వార్తల్లో వినిపిస్తున్నట్టు 30 కోట్లకు డీల్ ఓకే అయినా V సినిమా బ్రేక్-ఈవెన్ అవుతుందనే గ్యారెంటీ లేదు. బహూశా శాటిలైట్ కూడా కలిస్తే అప్పుడు దిల్ రాజు గట్టెక్కే ఛాన్సులు ఉన్నాయి.