ఉమామహేశ్వరరావు వచ్చేస్తున్నాడు

సత్యదేవ్ హీరోగా నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీకి ఇచ్చేశారనే విషయం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. ఇప్పుడీ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా బయటకొచ్చింది. ఈనెల 15న నెట్ ఫ్లిక్స్ లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా రాబోతోంది.

కేరాఫ్ కంచరపాలెంతో గుర్తింపుతెచ్చుకున్న వెంకటేష్ మహా తన రెండో ప్రయత్నంగా ఈ రీమేక్ సినిమాను తీశాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన మహేషింతే ప్రతీకారమ్ అనే సినిమాకు తెలుగు రీమేక్ ఇది. అరకులో సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాను పూర్తిచేశారు.

ఆర్కా మీడియా బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేద్దామని అనుకునే లోపే లాక్ డౌన్ పడింది. ఆ తర్వాత పరిస్థితులు మరింత జటిలంగా మారాయి. దీంతో తమ సినిమాను ఇప్పట్లో థియేటర్లలో రిలీజ్ చేయడం సాధ్యంకాదనే విషయాన్ని మేకర్స్ గ్రహించారు.

అందుకే సైలెంట్ గా నెట్ ఫ్లిక్స్ కు రైట్స్ అమ్మేశారు. అటు శాటిలైట్ రైట్స్ ను ఈటీవీకి ఇచ్చేశారు. తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ సినిమాతో మేకర్స్ రెట్టింపు కంటే ఎక్కువ లాభాలు తెచ్చుకున్నారని టాక్.