అమరావతిపై జగన్‌ది కుక్కను పిచ్చికుక్క అని ముద్రవేసి చంపే వ్యూహం…

అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబునాయుడు ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. దేవేంద్రుడు స్వర్గలోకానికి రాజు అయితే… అందుకు రాజధాని అమరావతి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిని ఎవరూ చంపలేరన్నారు. అలాంటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించబోవన్నారు.

తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్‌, కర్నాటకకు బెంగళూరు ఉందని… అలాంటి నగరం ఏపీకి లేదన్నారు. అందుకే తాను అమరావతి నిర్మాణానికి పూనుకున్నానని వివరించారు. గతంలో హైదరాబాద్‌లో సైబరాబాద్‌ను కట్టింది తానేనని చెప్పారు. తాను నాడు తీసుకున్న చొరవ వల్లనే భారత్ బయోటెక్‌ సంస్థ నేడు కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తోందన్నారు చంద్రబాబు.

కుక్కకు పిచ్చికుక్క పిచ్చికుక్క అంటూ ముద్రవేస్తే అందరూ వచ్చి తలోరాయి వేసి చంపేస్తారన్నట్టుగా… అమరావతిని కూడా చంపేందుకు అదే వ్యూహాన్ని జగన్‌మోహన్ రెడ్డి అనుసరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ (చంద్రబాబు మాత్రం తన ప్రసంగంలో ప్రధానిని ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అని సంబోధించారు) పవిత్రమైన పార్లమెంట్ మట్టి, యమున నీరు తెచ్చి ఇచ్చారని… పార్లమెంట్ మొత్తం అమరావతికి అండగా ఉంటుందని నాడు అన్నారని చంద్రబాబు చెప్పారు.

ఇప్పుడు నరేంద్రమోడీ చొరవ తీసుకుని అమరావతే రాజధానిగా ఉండేలా చూడాలని కోరారు. అలా చేస్తే అమరావతి అన్నది రాష్ట్రానికి, దేశానికే సంపద సృష్టించే ప్రాజెక్టు అవుతుందన్నారు చంద్రబాబు.