కడప ఎయిర్‌పోర్టులో ఇకపై నైట్ ల్యాండింగ్

కడప విమానాశ్రయంలో రాత్రి వేళ విమాన రాకపోకలకు లైన్ క్లియర్ అయింది. ఇందుకోసం ఎయిర్‌పోర్టులో లైట్స్‌ ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతి ఇచ్చింది. ఢిల్లీలో జరిగిన నేషనల్ వైల్డ్ లైఫ్‌ బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

కడప ఎయిర్‌పోర్టులో రాత్రివేళ విమానాలుది గేందుకు అవకాశాలను పరిశీలించాలని ఎయిర్‌పోర్టు అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి గతంలో సూచించారు. 2019 అక్టోబర్ 18న నిర్వహించిన ఏఏసీ మీటింగ్‌లో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సభ్యుల ముందు ఉంచారు. రాత్రి వేళల్లో విమానాలు దిగాలంటే పైలెట్లు గుర్తించేందుకు కొండలపై అబ్‌స్టాకిల్ లైట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తేల్చారు. ఇందుకు అటవీ శాఖ అనుమతి తప్పనిసరి అని మీటింగ్‌ లో తీర్మానించి అటవీ శాఖకు పంపించారు.

ఎట్టకేలకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే బృందం సూచించినట్టుగా నాలుగు ప్రాంతాల్లో అబ్‌స్టాకిల్‌ లైట్లు ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతి ఇచ్చింది. కడప ఫారెస్ట్ డివిజన్‌లోని మల్లేశ్వర అభయారణ్యంలో రెండు చోట్ల, ప్రొద్దుటూరు ఫారెస్ట్ డివిజన్‌లోని నాగార్జునసాగర్‌- శ్రీశైలం పులుల సంరక్షణప్రాంతంలో మరో రెండు చోట్ల అబ్‌స్టాకిల్ లైట్స్‌ ఏర్పాటు చేస్తారు. వీటి ఏర్పాటుకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు అనుమతి ఇచ్చింది.