ఓకే క్లియరా?… అయిపోయిందా?… పారిపోండి – మర్డర్ ప్లాన్‌ను పక్కాగా పర్యవేక్షించిన మాజీ మంత్రి

టీడీపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర పక్కాగా మర్డర్ ప్లాన్ అమలు చేసి దొరికిపోయారు. మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసును పోలీసులు చేధించారు. కొల్లు రవీంద్రే ఈ హత్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు వివరించారు.

ఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం… హత్య కేసులో ప్రధాన నిందితుడు చింతా నాంచారయ్యకు … మోకా భాస్కరరావుకు మధ్య ఏడెనిమిది ఏళ్ల నుంచి రాజకీయంగా ఆధిపథ్యపోరు నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో చింతా నాంచారయ్య టీడీపీ నుంచి… మోకా భాస్కరరావు వైసీపీ నుంచి ఒకే వార్డు నుంచి బరిలో ఉన్నారు.

2013లోనూ మోకా భాస్కరరావును హత్య చేసేందుకు నాంచారయ్య కుటుంబం ప్రయత్నించింది. కానీ అప్పట్లో హత్యాయత్నం విజయవంతం కాలేదు. తిరిగి గత ఆరు నెలల నుంచి వీరిద్దరి మధ్య చిన్న గొడవలు జరుగుతున్నాయి. మోకా భాస్కరరావు పలు అభివృద్ది పనులు చేస్తూ ప్రజల్లో, కులంలో పట్టుపెంచుకుంటూ వెళ్తున్నారు. దాంతో రాజకీయంగా భవిష్యత్తు ఉండదని ఆందోళన చెందిన నాంచారయ్య మూడునాలుగు నెలల క్రితం నుంచే మోకా భాస్కరరావు హత్యకు ప్రణాళిక సిద్ధం చేస్తూ వచ్చారు.

మోకా భాస్కరరావు హత్యకు 15 రోజుల ముందు చింతా నాంచారయ్య … మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి మీరు అనుమతి ఇస్తే మోకా భాస్కరరావును అడ్డుతొలగిస్తామని… లేకుంటే రాజకీయంగా తట్టుకోవడం కష్టమవుతుందంటూ వివరించారు. అప్పుడు మాత్రం హత్య చేయడానికి ఇది సరైన సమయం కాదని కొల్లు రవీంద్ర వారిని పంపించారు.

తిరిగి గత 15రోజుల్లో మోకా భాస్కరరావుకు, చింతా నాంచారయ్యకు మధ్య చిన్నచిన్న వివాదాలు తలెత్తాయి. దాంతో మోకా భాస్కరరావును లేపేయాల్సిందేనని నిర్ణయించుకున్నారు. హత్యకు నాలుగు రోజుల ముందు కొల్లు రవీంద్రను కలిసి మర్డర్ ప్లాన్‌పై నాంచారయ్య చర్చించారు. ఒకే గదిలో ఇద్దరూ ముఖాముఖి కూర్చుని మాట్లాడుకున్నారు.

ఈ భేటీలో మోకా భాస్కరరావు హత్యకు కొల్లు రవీంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన పేరు ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తపడాల్సిందిగా నాంచారయ్యకు కొల్లు రవీంద్ర ఆదేశించారు. మర్డర్ ప్లాన్‌ మిస్‌ అవడానికి వీల్లేదని… అలా మిస్‌ అయితే ఇబ్బందులు వస్తాయని… జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నాంచారయ్యకు కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

కొల్లు రవీంద్ర అభయం ఇవ్వడంతో హత్యకు నాలుగు రోజుల ముందు నుంచే మోకా భాస్కరరావుపై నిందితులు నిఘా ఉంచారు. 28వ తేదీనే హత్య చేసేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. దాంతో ఆ మరుసటి రోజు మచిలీపట్నం చేపల మార్కెట్‌కు మోకా భాస్కరరావు ఒంటరిగా వస్తారని పసిగట్టిన హంతుకులు … 29వ తేదీ చేపల మార్కెట్‌లో దాడి చేశారు.

అరెస్ట్ అయిన నిందితులను విచారించగా… కొల్లురవీంద్ర ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు బయటకు వచ్చాయని ఎస్పీ వివరించారు. అరెస్ట్ అయిన తొలిరోజే ప్రధాన నిందితుడు నాంచారయ్య… ఈ హత్య వెనుక మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం ఉన్నట్టుగా వాంగ్మూలం ఇచ్చారని ఎస్పీ వివరించారు. మరింత లోతుగా వెళ్లి కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. కొల్లు రవీంద్ర ఇద్దరి పీఏల కాల్‌ డేటా పరిశీలించారు.

హత్య నేపథ్యంలో తనకు నేరుగా ఫోన్ చేయవద్దని నాంచారయ్య బృందానికి మాజీమంత్రి సూచించారు. ఏదైనా అత్యవసరమైతే తన పీఏల నెంబర్‌ లకు ఫోన్ చేయాలని కొల్లు సూచించారు. హత్యకు ముందు, హత్యకు తర్వాత కొల్లు రవీంద్ర పీఏ నెంబర్‌కు నిందితులు ఫోన్ చేశారు. హత్యజరిగిన 15 నిమిషాల తర్వాత నాంచారయ్య… తన సహచరుడి ఫోన్ నుంచి కొల్లు రవీంద్ర పీఏకు ఫోన్ చేశారు. ఆ సమయంలో కొల్లు రవీంద్ర కలెక్టరేట్‌లో ఉన్నారు. పీఏ ఫోన్ తీసుకెళ్లి ఇవ్వగా… ఒంటరిగా పక్కకు వెళ్లి కొల్లు రవీంద్ర మాట్లాడారు. ఓకే… అంతా క్లియరా… అంతా అయిపోయిందా… ఓకే జాగ్రత్త.. పారిపోండి అని కొల్లు రవీంద్ర సూచించారు.

ఆ తర్వాత కూడా పలుమార్లు కొల్లు రవీంద్ర పీఏల నెంబర్లకు ఫోన్ చేసి… వారి ఫోన్ల ద్వారా కొల్లు రవీంద్రతో నిందితులు మాట్లాడారని ఎస్పీ వివరించారు. ఈ హత్య ప్లాన్‌లో కొల్లు రవీంద్ర నేరుగా భాగస్వామి అయ్యారని… హంతకులకు ప్రోద్బలం ఇచ్చారని… సపోర్టు చేశారని ఎస్పీ వివరించారు. కేవలం వాంగ్మూలం ఆధారంగా కాకుండా ఇతర సాంకేతిక ఆధారాలు లభ్యం అయిన తర్వాతనే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వివరించారు.