వర్మ చేతిలో ఏకంగా 4 సినిమాలు

మొన్నటివరకు థియేట్రికల్ రిలీజ్ కోసం నానా కష్టాలు పడ్డాడు ఆర్జీవీ. ఎందుకంటే అతడి సినిమాలకు ఎప్పుడో మార్కెట్ పోయింది. మొదటి రోజు ఆడడమే కష్టంగా మారింది. అలాంటి వర్మకు కరోనాతో మంచి అవకాశం దొరికింది. థియేటర్లతో సంబంధం లేకుండా తన సినిమాల్ని నేరుగా ఓటీటీలోకి విడుదల చేయడం స్టార్ట్ చేశాడు.

ముందుగా క్లైమాక్స్ అనే సినిమా, ఆ తర్వాత నగ్నం అంటూ మరో సినిమా. ఇలా రెండు సినిమాలు రిలీజ్ చేసిన వర్మకు.. ఓటీటీ మజా అర్థమైంది. అందులో లాభాలు అతడికి కళ్లముందు కనిపిస్తున్నాయి. దీంతో ఏకబిగిన 4 సినిమాలు స్టార్ట్ చేశాడు ఈ డైరక్టర్. ఆ 4 సినిమాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి.

కరోనాపై సినిమా ప్రకటించిన వర్మ ఆ మూవీని దాదాపు 60శాతం పూర్తిచేశాడు. ప్రస్తుతం దానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. అటు మారుతిరావు-అమృతలపై మర్డర్ అనే సినిమా తీస్తున్నాడు. దీంతో పాటు పవన్ కల్యాణ్ పై పవర్ స్టార్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ 3 సినిమాలతో పాటు “12 ఓ క్లాక్” అనే మరో సినిమా కూడా స్టార్ట్ చేశాడు. వీటన్నింటినీ నెల రోజులకు ఒకటి చొప్పున వదలబోతున్నాడు వర్మ.