ఒరిగిన ట్యాంకుపై అసత్య వార్తలు

తెలంగాణలో మిషన్ భగీరథలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లిలో ఒక వాటర్ ట్యాంకును నిర్మించారు. దీని కోసం 15 లక్షలు ఖర్చు చేశారు. ట్రయల్ రన్‌ కోసం ఇటీవల దాన్ని నింపగా… ట్యాంకు మొత్తం ఒకవైపు ఒరిగిపోయింది. దాంతో దాన్ని కూల్చివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్దం చేశారు.

ఇది మిషన్ భగీరథ కింద నిర్మించిన ట్యాంకే అయినప్పటికీ దీన్ని నిర్మించింది స్థానిక కాంట్రాక్టరే. ఇలాంటి చిన్నచిన్న పనులు తెలంగాణ ప్రభుత్వం స్థానిక కాంట్రాక్టర్లకు అప్పగించింది. అయితే కొన్ని రాజకీయ పార్టీల వారు మాత్రం ఈ ట్యాంకును నిర్మించింది మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ అని ప్రచారం చేస్తున్నారు. ఆ సంస్థను బ్లాక్‌మెయిల్‌ చేయడానికి ప్రయత్నిస్తున్న నేతలు కొందరు దీన్ని వాడుకున్నారు.

కొద్దిరోజుల క్రితం కొండపోచమ్మ సాగర్‌ కాలువకు గండిపడిన సమయంలోనూ ఇదే తరహా ప్రచారం చేశారు. స్థానిక కాంట్రాక్టర్లు చేసిన పనులను…. మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేసిందంటూ ఆ సంస్థ ఖ్యాతిని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ప్రభుత్వం, నిర్మాణ సంస్థ వివరణ ఇవ్వడంతో మేఘా సంస్థపై చేసిన ప్రచారం అవాస్తవమని తేలింది.

ఇప్పుడు నాగర్‌ కర్నూలు జిల్లాలో ఒరిగిన ట్యాంకును కూడా మేఘా సంస్థకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మేఘా సంస్థ పరుగులు పెట్టిస్తుండడంతో … దాన్ని జీర్ణించుకోని కొన్ని రాజకీయపార్టీల అభిమానులు… తెలంగాణలో స్థానిక కాంట్రాక్టర్ నిర్మించిన ట్యాంకు ఒరిగితే దాన్ని మేఘా సంస్థే నిర్మించిందని… ఇక పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటో అంటూ ప్రచారం చేస్తున్నారు.