విజయ్ దేవరకొండ నాకు బెస్ట్ ఫ్రెండ్… కానీ…

రామ్ గోపాల్ వర్మ తీసిన నగ్నం సినిమాతో స్వీటీ అనే కొత్త హీరోయిన్ పరిచయమైందని అంతా అనుకుంటున్నారు. కానీ ఆమె ఇండస్ట్రీకి కొత్త కాదు, ఆమెకు ఇండస్ట్రీ కొత్త కాదు. దాదాపు పదేళ్లుగా ఆమె ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఆమె వృత్తి ఫ్యాషన్ డిజైనర్. హీరోహీరోయిన్లకు కాస్ట్యూమ్ డిజైనర్. ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన శ్రీ రాపాక అలియాస్ స్వీటీ.. విజయ్ దేవరకొండతో తనకున్న పరిచయాన్ని బయటపెట్టింది.

“విజయ్ దేవరకొండ నాకు బెస్ట్ ఫ్రెండ్. దాదాపు ఇద్దరం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. అతడి ఒంటి మీద మొట్టమొదట బట్ట వేసింది నేను. ఓ సినిమాలో హీరో పాత్ర కోసం ఫొటోలు కావాలంటే అతడికి నేను దుస్తులు వేసి, ఓ చిన్న ఇంట్లో ఫొటో షూట్ చేశాం. అలా విజయ్ దేవరకొండకు తొలి డిజైనర్ నేను అయ్యాను. చాలా సినిమాల ఆడిషన్స్ కు నేనే అతడ్ని తీసుకెళ్లాను.”

విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయినా తనను మరిచిపోలేదంటోంది స్వీటీ. గీతగోవిందం సినిమాకు డిజైనర్ గా తనను తీసుకోవాలని దర్శకుడికి దేవరకొండ 2-3 సార్లు చెప్పాడని.. కానీ వేరే ఆబ్లిగేషన్ వల్ల తన స్థానంలో మరొకరిని తీసుకున్నారని చెప్పింది స్వీటీ. విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయిన తర్వాత అతడ్ని కలవాలని అనుకోలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదని చెబుతోంది.