బాలయ్య సినిమాలో అమలాపాల్…

బాలయ్య-బోయపాటి కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఓ స్టార్ హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు చాన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని స్వయంగా దర్శకుడు ప్రకటించడంతో పుకార్లకు చెక్ పడింది.

అయితే ఇప్పుడు మళ్లీ ప్లాన్ మారినట్టు కనిపిస్తోంది. ఓ కొత్త హీరోయిన్ తో సెట్స్ పైకి వెళ్లేకంటే, కాస్త పేరున్న హీరోయిన్ ను తీసుకుంటే సినిమాకు బజ్ వస్తుందని భావిస్తున్నారట. నిజానికి సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంది. ఆ సెకెండ్ హీరోయిన్ పాత్రకు కొత్తమ్మాయిని పరిమితం చేసి, మెయిన్ పాత్రకు క్రేజీ హీరోయిన్ నే తీసుకోవాలని తాజాగా నిర్ణయించారు.

ఈ క్రమంలో అమలాపాల్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమలాపాల్ ఓకే అంటే సినిమా షెడ్యూల్ ప్రారంభించాలని అనుకుంటున్నారట. తెలుగులో అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో పేరు తెచ్చుకుంది అమలాపాల్. ఆ తర్వాత చరణ్ సరసన నాయక్ సినిమాలో నటించింది.

ఈమధ్య తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయలేదు అమలాపాల్. బాలయ్య-బోయపాటి సినిమాలో నటించడానికి ఒప్పుకుంటే.. ఆమెకు ఇది దాదాపు రీఎంట్రీ మూవీ లాంటిది.