పుకార్లకు చెక్ పెట్టిన యాంకర్

రవికృష్ణ, బాలకృష్ణ, ప్రభాకర్, నిత్యా సామి.. ఇలా టెలివిజన్ ఆర్టిస్టులంతా వరుసగా కరోనా బారిన పడ్డంతో షూటింగ్స్ దాదాపు నిలిచిపోయాయి. మిగతా నటీనటులు కూడా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో యాంకర్ కమ్ నటి ఝాన్సీకి కూడా కరోనా సోకిందంటూ వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటోందని రాసుకొచ్చింది ఓ వర్గం మీడియా.

నిజానికి ఈ వార్తలు రావడానికి కూడా కారణం ఝాన్సీనే. తను హోం ఐసొలేషన్ లో ఉన్నానని, ఎవ్వర్నీ కలవడం లేదని, మందులు కూడా వేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది ఝాన్సీ. ఈ మేరకు ఆమె ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఇది చూసి చాలామంది ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని అనుకున్నారు.

కానీ హోమ్ క్వారంటైన్ కు, హోం ఐసొలేషన్ కు తేడా చెబుతోంది ఝాన్సీ. కేవలం అనుమానంతోనే తను అందరికీ దూరంగా ఐసొలేషన్ లో ఉంటున్నానని, కరోనా సోకిన వాళ్లు క్వారంటైన్ లో ఉంటారని క్లారిటీ ఇచ్చింది.

స్టార్ మా ఛానెల్ లో పరివార్ సీజన్-2 అనే కార్యక్రమం చేస్తోంది ఝాన్సీ. ఇందులో పాల్గొన్నవారిలో కొందరికి కరోనా సోకింది. దీంతో ముందుజాగ్రత్తగా ఝాన్సీ కూడా ఇంట్లో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అదీ సంగతి.