కరోనా కట్టడి చర్యల్లో ఏపీ ముందంజ

కరోనా కట్టడి చర్యల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మన్ననలు పొందుతోంది. పరీక్షల నిర్వాహణలో ఆంధ్రప్రదేశ్‌ 10 లక్షల మార్కును దాటేసింది. ప్రతి పదిలక్షల మందికి అత్యధిక పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది.

ఢిల్లీలో ప్రతి పది లక్షల మంది జనాభాకు సరాసరి 31వేల 800 పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల్లో రెండో స్థానంలో ఉన్న ఏపీలో ప్రతి పది లక్షల మంది జనాభాకు సరాసరి 19వేల 48 కరోనా పరీక్షలు చేశారు.

పాజిటివిటీ రేటు జాతీయ స్థాయిలో 6.88 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ శాతం కేవలం 1.84గా మాత్రమే ఉంది. మరణాల రేటు జాతీయ స్థాయిలో 2.86 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ మరణాల రేటు 1.24 శాతం మాత్రమే ఉంది. ఆదివారం ఉదయానికి ఏపీలో 10లక్షల 17వేల 123 కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలి లక్ష పరీక్షలు నిర్వహించడానికి 59 రోజులు పట్టగా… ఇప్పుడు కేవలం నాలుగు రోజుల్లోనే లక్ష పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని ఏపీ సొంతం చేసుకుంది. పరీక్షల విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం వెనుకబడింది. అతి తక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ నిలుస్తోంది. పాజిటివిటీ రేటు తెలంగాణలో ఏకంగా 20.18 శాతంగా ఉంది.

తెలంగాణలో ప్రతి పదిలక్షల మందికి సరాసరి 2వేల 813 పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో చేసిన మొత్తం పరీక్షల సంఖ్య లక్షా 10వేల 545 గా ఉంది. మరణాల రేటు మాత్రం తెలంగాణలోనూ తక్కువగానే ఉంది. జాతీయ స్థాయిలో మరణాల రేటు 2.86గా ఉండగా… తెలంగాణలో కేవలం 1.29గా మాత్రమే ఉంది. రికవరీ రేటు 51. 71 శాతంగా ఉంది.