స్లో అండ్ స్టడీ ఆచార్య

కరోనా ప్రభావం మొదలైన వెంటనే ఆగిపోయిన మొదటి సినిమా ఆచార్య. ప్రభుత్వం చెప్పకముందే చిరంజీవి తన సినిమా షూటింగ్ ఆపేశారు. షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చిన వెంటనే ఈ సినిమానే మొదలవుతుందని అంతా అనుకున్నారు. అన్ని జాగ్రత్తల మధ్య షూటింగ్ స్టార్ట్ చేసి, చిరంజీవి అందరికీ ఆదర్శంగా నిలుస్తారని అంతా భావించారు. కానీ ఆచార్య ఇంకా సెట్స్ పైకి రాలేదు.

హైదరాబాద్ లో కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్న వేళ.. ఆచార్య సినిమాను ఇప్పట్లో సెట్స్ పైకి తీసుకురాకూడదని నిర్ణయించారు చిరంజీవి. తనతో పాటు యూనిట్ లోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం ముఖ్యమే కాబట్టి, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేవరకు సెట్స్ పైకి వెళ్లకూడదని చెప్పేశారు. ఈ మేరకు మరోసారి దర్శకుడు కొరటాల శివకు సమాచారం అందించారట మెగాస్టార్.

సినిమా ఆల్రెడీ ఆలస్యమైంది. ఇలాంటి టైమ్ లో ఇంకాస్త గ్యాప్ తీసుకోవడంలో తప్పులేదనేది చిరంజీవి అభిప్రాయం. నిదానంగానే సినిమాను పూర్తిచేద్దామని, సహనం కోల్పోవద్దని కొరటాలకు సూచించారు మెగాస్టార్.

సో.. ఆచార్య సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. అటు ఈ సినిమాలో రామ్ చరణ్ నటించాల్సిన పోర్షన్ అలానే పెండింగ్ లో పడింది. చిరంజీవితో పాటు చరణ్ కాల్షీట్లు కూడా కావాలి. ఇవన్నీ ఎప్పుడు కొలిక్కి వస్తాయో చూడాలి.