వకీల్ సాబ్ ను పక్కనపెట్టిన పవన్

వచ్చే నెల నుంచి పవన్ కాల్షీట్లు ఇచ్చాడు. సెట్స్ పైకి వస్తానని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆయన కాల్షీట్లు ఇచ్చింది వకీల్ సాబ్ కు కాదు. క్రిష్ సినిమాకు. అవును.. ఆగస్ట్ మూడో వారం నుంచి క్రిష్ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు పవన్. ఈ మేరకు అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.

నిజానికి పవన్ ముందున్న తొలి ప్రాధాన్యం వకీల్ సాబ్. దాదాపు 80శాతం పూర్తయిన ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయిస్తే, మిగతా 20 శాతం పూర్తయిపోతుంది. సినిమా విడుదలకు లైన్ క్లియర్ అవుతుంది. కానీ పవన్ మాత్రం వకీల్ సాబ్ ను వెనక్కుపెట్టి, క్రిష్ సినిమాకు కాల్షీట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

తాజా సమాచారం ప్రకారం, వకీల్ సాబ్ సినిమాకు ఇంకా హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదని తెలుస్తోంది. మొన్నటివరకు తమన్న పేరు వినిపించినప్పటికీ, ఉన్నఫలంగా కాల్షీట్లు ఇవ్వడానికి తమన్నకు కూడా వేరే కమిట్ మెంట్స్ అడ్డొస్తున్నాయి. దీంతో వకీల్ సాబ్ ను పక్కనపెట్టి, క్రిష్ సినిమాకు పవన్ కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తోంది.