Telugu Global
National

అందరూ భయపడ్డారు... ఆమె ధైర్యం చేసింది!

మనిషిని చూసి మనిషే భయపడుతున్న కరోనా కాలం ఇది.  హాస్పటల్ లో చికిత్స తీసుకుని కరోనా నుండి కోలుకున్న తమ కుటుంబ సభ్యులను ఇంటికి తీసుకువెళ్లేందుకు సైతం జనం భయపడుతున్నారు. కరోనా బారిన పడినవారినే కాదు, కోలుకుని ఇంటికి వచ్చినవారిని సైతం చుట్టుపక్కల వాళ్లు భయంగా వింతగా చూస్తున్నారు. మణిపూర్ కి చెందిన సోమిఛాన్ ఛితుంగ్ అనే 22 ఏళ్ల అమ్మాయి సైతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. కరోనా బారినపడి దాని నుండి బయటపడి నెగెటివ్ వచ్చాక […]

అందరూ భయపడ్డారు... ఆమె ధైర్యం చేసింది!
X

మనిషిని చూసి మనిషే భయపడుతున్న కరోనా కాలం ఇది. హాస్పటల్ లో చికిత్స తీసుకుని కరోనా నుండి కోలుకున్న తమ కుటుంబ సభ్యులను ఇంటికి తీసుకువెళ్లేందుకు సైతం జనం భయపడుతున్నారు. కరోనా బారిన పడినవారినే కాదు, కోలుకుని ఇంటికి వచ్చినవారిని సైతం చుట్టుపక్కల వాళ్లు భయంగా వింతగా చూస్తున్నారు.

మణిపూర్ కి చెందిన సోమిఛాన్ ఛితుంగ్ అనే 22 ఏళ్ల అమ్మాయి సైతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. కరోనా బారినపడి దాని నుండి బయటపడి నెగెటివ్ వచ్చాక ఇంటికి వెళ్లడానికి సిద్ధమైన సోమిఛాన్ ని ఆటోలో తీసుకువెళ్లేందుకు ఏ ఆటో డ్రైవరూ ఒప్పుకోలేదు.

అలాంటి పరిస్థితుల్లో 52ఏళ్ల లైబీ ఒయినమ్ అనే మహిళా ఆటోడ్రైవరు సోమిఛాన్ ని తన ఆటోలో ఇంటికి చేర్చింది. 140 కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిది గంటల ప్రయాణాన్ని లెక్కచేయకుండా… అందరూ భయపడుతున్నారు కదా… నేనెందుకు తీసుకువెళ్లాలి, నాకేమవుతుందో అనే ఆందోళన లేకుండా కేవలం తన డ్యూటీగా భావించి ఆ పనిచేసింది. ఆ పరిస్థితుల్లో తానే ఉంటే ఎంత బాధగా ఉంటుంది… అనే ఆలోచనతోనే ఆమె ముందుకు వచ్చింది. లైబీ మానవత్వంతో చేసిన సాహసానికి, ఆమె సహృదయానికి తగిన గుర్తింపు దొరికింది. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ లక్షాపదివేల రూపాయల చెక్కుతోపాటు సంప్రదాయ మణిపూరీ మఫ్లర్ కప్పి లైబీని సత్కరించారు.

అసలేం జరిగిందంటే…రెండువారాల పాటు కోవిడ్ 19 కి చికిత్స తీసుకుని ఇంఫాల్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి డిశ్చార్జ్ అయ్యి సోమిఛాన్ తన సొంత ఊరు కామ్ జంగ్ కి బయలుదేరింది. సోమిఛాన్ నర్సుగా పనిచేస్తోంది. ఇంఫాల్ లోని ఒక ప్రాంతం వరకు హాస్పటల్… తమ అంబులెన్స్ ని ఏర్పాటు చేసింది. అక్కడి నుండి సొంత ఊరికి వెళ్లేందుకు వాహనం ఆమె ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. దాంతో సోమిఛాన్ కి చెందిన బంధువులు ఇద్దరు…. ఆమెని ఆటోలో పంపాలని భావించి ఆటో కోసం ప్రయత్నించారు. అయితే ఏ డ్రైవరూ అందుకు ఒప్పుకోలేదు. తనని వారంతా భయంభయంగా చూశారని తనకి ఏడుపు వచ్చేసిందని సోమిఛాన్ ఆ రోజు జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ చెప్పింది.

ఆ సమయంలో లైబీ అదే ప్రాంతంలో చేపలు అమ్ముతోంది. ఆమె ఆటో నడపటంతో పాటు కుటుంబ పోషణ కోసం ఈ పని కూడా చేస్తుంటుంది. విషయం అర్థం చేసుకున్న లైబీ తనకు ఆటో ఉందని తాను వస్తానని అంది. 140 కిలోమీటర్ల దూరం… దాదాపు ఎనిమిది గంటలు పడుతుంది. ఐదువేలకు ఆటో కిరాయి మాట్లాడుకున్నారు. లైబీ భర్త కూడా ఆటోలో వెళ్లాడు ఆ ఇద్దరు మహిళలకు తోడుగా. ఆ ప్రయాణం.. .. తన జీవితంలో చాలా కష్టతరమైన ప్రయాణంగా లైబీ తెలిపింది. లైబీ చాలా మంచి మహిళ అని, ప్రయాణమంతటిలో ఆమె తనని కోవిడ్ 19 గురించి ప్రశ్నలు వేసి వివరాలు అడిగిందని… కానీ ఎక్కడా తనని అసౌకర్యానికి గురిచేయలేదని, తనని చూసి భయపడలేదని సోమిఛాన్ తెలిపింది.

ఇదిలా ఉంటే… లైబీ గురించి చెప్పుకోవాల్సింది ఇంకా ఉంది. ఈమె పైన 2015లో మీనా లాంగ్ జామ్ అనే దర్శకురాలు డాక్యుమెంటరీ తీసింది. దానికి అనేక అవార్డులు సైతం వచ్చాయి. లైబీ చేసిన పనిని విని మీనా… అందులో ఆశ్చర్యం ఏమీ లేదని, వందలమంది మగ ఆటోడ్రైవర్ల మధ్య ఆటో నడుపుతున్న అత్యంత ధైర్యవంతురాలు లైబీ… అని పేర్కొంది. లైబీ… సోమిఛాన్ కి సహకరించి ఆమెని ఇంటికి చేర్చిన విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్లి ఆమెకు మరింత గుర్తింపుని, నగదు బహుమతిని తెచ్చిపెట్టింది. తాను తన విధినే నిర్వర్తించానని ఇంత గుర్తింపు దక్కుతుందని అనుకోలేదని అంటోంది లైబీ.

First Published:  6 July 2020 11:53 AM GMT
Next Story