తిరువనంతపురంలో త్రిపుల్ లాక్‌డౌన్

కేరళ రాజధాని తిరువనంతపురంలో త్రిపుల్‌ లాక్‌డౌన్‌ విధించారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేయబోతున్నారు. నిత్యావసర వస్తువులు మాత్రమే అనుమతిస్తారు. ఆసుపత్రులు, మెడికల్‌ షాపులు మాత్రమే ఓపెన్‌ చేస్తారు. మిగతా ఎలాంటి షాపులు తెరవడం లేదు. ప్రభుత్వ ఆఫీసులతో పాటు సచివాలయం కూడా పనిచేయదని అధికారులు ప్రకటించారు.

తిరువనంతపురంలో ఆదివారం 27 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకూ జిల్లాలో ఒకే రోజు ఇన్ని కేసులు ఎప్పుడూ నమోదు కాలేదు. వీటిలో చాలా వరకు ప్రైమరీ కాంట్రాక్ట్‌ తెలియలేదు. దీంతో కమ్యూనిటీ ట్రాన్స్‌ మిషన్‌ జరిగిందని అనుమానాలు ఉన్నాయి. అందుకే వెంటనే వారం రోజుల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. చేపల మార్కెట్‌ నుంచి ఈ సారి వైరస్‌ వ్యాప్తి జరిగినట్లు గుర్తించారు. అక్కడే కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి.

త్రిపుల్‌ లాక్‌డౌన్ లో మూడు దశలు పెట్టారు. మొదటి దశలో భాగంగా తిరువనంతపురం కార్పొరేషన్‌ పరిధిలో పూర్తిగా లాక్‌డౌన్‌ విధించారు. సిటీలోకి రాకపోకలు పూర్తిగా నిషేధించారు.

రెండో దశలో భాగంగా పాజిటివ్‌ కేసులు తేలిన క్లస్టర్‌లో పూర్తిగా ఎవరినీ బయటకు రాకుండా చూస్తారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ల లిస్ట్‌ తయారు చేసి… వైరస్‌ వ్యాప్తి జరగకుండా చూస్తారు.

మూడో దశలో భాగంగా పాజిటివ్‌ వచ్చిన వారి ఇళ్లపై ఫోకస్‌ పెడతారు. వారు ఇళ్లకే పరిమితమయ్యే విధంగా చర్యలు తీసుకుంటారు .