ఊహించిందే…. ఇక చంద్రబాబు కోసం గొలుసులు రెడీ చేయాలి….

టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీలోకి క్యూ కడుతున్న టీడీపీ నేతలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నకనకలాడుతున్న టీడీపీ మిడతల దండు ఇప్పుడు కమలం వైపు కదులుతోందని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే బీజేపీలో చేరిన టీడీపీ మిడతలు సృష్టిస్తున్న విధ్వంసం గమనించేలోగానే మిగిలిన మిడతలు ఎగురుకుంటూ వెళ్తున్నాయన్నారు. ఈ టీడీపీ మిడతల విపత్తు నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

మరో ట్వీట్‌లో… ”ఎన్నికలకు ముందు జగన్ గారు అసలు అధికారంలోకి రానే రారన్నాడు ఓ పబ్లిక్ పార్క్ ఆక్రమించుకున్న ఓ విశాఖ గల్లీ నాయకుడు. పచ్చ మీడియాలో డిబేట్లతో ఊదరగొట్టి ఇప్పుడు పూర్తికాలం అధికారంలో ఉండరంటున్నాడు. ఈ CBN తొత్తుల ప్రీపెయిడ్ సిమ్స్ కి రీఛార్జ్ చేయడం ఆపేస్తే నోళ్లు మూగబోతాయి.” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సబ్బంహరి గురించి అయి ఉంటాయని భావిస్తున్నారు.

ఇక తన వల్లనే కరోనా వ్యాక్సిన్ కనుగొన్నారని ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఇక గొలుసులు సిద్ధం చేయాల్సిందేనన్నారు. ” ఆశ్చర్యం లేదు. ఊహించిందే. ప్రపంచంలో ఎక్కడ కోవిడ్ వ్యాక్సిన్ తయారైనా తన ఖాతాలో వేసుకుంటాడని… ప్రపంచ ప్రఖ్యాత అమరావతి మాయా నగరం లాగే ఈయన సృష్టించిన బయోటెక్ పార్కులో వ్యాక్సిన్ తయారవుతోందని ప్రజలంతా కృతజ్ఞత వ్యక్తం చేశారట… మైండ్ డీ జనరేట్ అవుతోంది. గొలుసులు సిద్ధం చేయాల్సిందే.” అంటూ ట్వీట్ చేశారాయన.