మరణిస్తూ… హంతకుడి గురించి క్లూ ఇచ్చాడు !

తనపై కాల్పులు జరిపిన హంతకులకు సంబంధించిన సమాచారం ఇచ్చి ప్రాణాలు వదిలాడు హర్యానా పోలీస్ రవీందర్ సింగ్ (28). పారిపోతున్న దుండగుల వాహనం నెంబరుని తన అరచేతిపై రాసుకున్నాడు రవీందర్. దాంతో నిందితులను పట్టుకోవటం పోలీసులకు తేలికైంది. లేకపోతే వారు దొరకటం చాలా కష్టమై ఉండేది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఒకరు పోలీసుల కాల్పుల్లో మరణించగా మిగిలిన ఐదుగురు పట్టుబడ్డారు.

కానిస్టేబుల్ రవీందర్ సింగ్ తో పాటు ప్రత్యేక పోలీస్ అధికారి కప్తాన్ సింగ్ (43) గత మంగళవారం నాడు దుండగుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం దుండగులు సోనీపేట్ జింద్ రోడ్ అనే ప్రాంతంలో కారుని పార్క్ చేసి ఆల్కాహాల్ తాగుతున్నారు. అది కర్ఫ్యూ ప్రాంతం కూడా కావటంతో… వారిని రోడ్డుపై తాగవద్దని అక్కడినుండి వెళ్లిపోమని రవీందర్ సింగ్, కప్తాన్ సింగ్ హెచ్చరించారు. దుండగులు పట్టించుకోకపోగా వాదనకు దిగారు. దాంతో గొడవ పెరిగింది.

దుండగులు పదునైన ఆయుధాలతో రవీందర్, కప్తాన్ లపై దాడి చేసి వారి ప్రాణాలు తీశారు.  దాడి అనంతరం వారు తమ వాహనంలో తప్పించుకుని పారిపోయారు. అయితే  తీవ్రమైన గాయాలతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయే సమయంలో కూడా రవీందర్ సింగ్ ఎంతో ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. దుండగుల వాహనం తాలూకూ నెంబరుని అతికష్టంమీద… చూసినవారికి అర్థమయ్యేలా తన అరచేతిపై రాసుకున్నాడు. దాంతో నిందితులను పట్టుకోవటం తేలికైంది.

పోలీసులకు ఉండే ప్రాథమిక నైపుణ్యాన్ని సాహసవంతుడైన రవీందర్ సింగ్ ప్రదర్శించాడని, పోస్ట్ మార్టమ్ సమయంలో అతని చేతిమీద ఉన్న నెంబరుని గుర్తించడం జరిగిందని హర్యానా డిజిపి వెల్లడించారు. రవీందర్ పేరుని మరణానంతరం ఇచ్చే పోలీస్ మెడల్ కోసం సూచించనున్నట్టు  ఆయన తెలిపారు.