కొల్లు రవీంద్ర టీడీపీ స్క్రిప్ట్‌ను ఫాలో కాలేదట…

మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో టీడీపీనేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. కొల్లు రవీంద్ర అరెస్ట్‌ విషయంలో టీడీపీ ఇచ్చిన సూచనలను, సలహాలను కొల్లు రవీంద్ర పాటించలేదన్న చర్చ ఆపార్టీలో నడుస్తోంది. దీనిపై పలు మీడియా చానళ్లలో ఆసక్తికరమైన కథనాలు కూడా వస్తున్నాయి.

కొల్లు రవీంద్ర ప్రోత్సాహంతోనే మోకా భాస్కరరావును హత్య చేసినట్టు సహనిందితులు అంగీకరించడంతో కొల్లురవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే టీడీపీ నాయకత్వం నుంచి కొన్ని సూచనలు వెళ్లినట్టు సమాచారం.

అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తే… ఆ సమయంలో తాను బీసీని కాబట్టే కక్ష కట్టి ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆరోపించాలని కొల్లుకు పార్టీ సూచించింది. అరెస్ట్ చేసి తీసుకెళ్లే సమయానికి మీడియాను అక్కడికి పంపించేలా టీడీపీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అయితే కొల్లు రవీంద్ర మాత్రం టీడీపీ సూచనలు పాటించకుండా… వెనుక నుంచి గోడ దూకి పారిపోయారు. దాంతో పోలీసులు గాలింపు చేపట్టి తుని వద్ద హైవే మీద అరెస్ట్ చేశారు.

తప్పు చేయకుంటే ఇలా ఎందుకు పారిపోతారని పోలీసులు చెప్పడంతో టీడీపీ నేతలు ఆత్మరక్షణలోపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించగానే… పోలీసులు అడిగిన ప్రశ్నలకు కొల్లు రవీంద్ర బోరున విలపించారని చెబుతున్నారు. తమ మామను పిలిపిస్తే అన్ని విషయాలు చెబుతానని పోలీసులను ప్రాధేయపడ్డారు. దాంతో పోలీసులు కొల్లు రవీంద్ర మామతో పాటు లాయర్‌ను పిలిపించారు.

బీసీని కాబట్టే కక్షసాధిస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించి ఉంటే ఆ తర్వాత పార్టీని రంగంలోకి దించి పెద్దెత్తున నిరసన తెలపాలని టీడీపీ భావించిందని సమాచారం. కానీ కొల్లు రవీంద్ర గోడ దూకి పారిపోవడంతో… ఆయన నేరం చేశారన్న భావన మరింత బలపడిందని టీడీపీనేతలు దూకుడు తగ్గించారు.

చంద్రబాబు దగ్గరి నుంచి చోటా నాయకుడిదాకా బీసీ అయిన కొల్లు రవీంద్రను వేదిస్తారా? అని మీడియాలో గోల గోల చేశారు. అయితే వైసీపీ కూడా ఎదురుదాడి ప్రారంభించింది. చనిపోయిన వ్యక్తి కూడా బీసీ కాదా? అని నిలదీయడంతో టీడీపీ మరింత వెనక్కి తగ్గింది.