సుశాంత్ ను తప్పించిన మాట నిజమే

సుశాంత్ ఆత్మహత్యపై ముంబయి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే దాదాపు 30 మందికి పైగా విచారించిన పోలీసులు, తాజాగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని కూడా ప్రశ్నించారు. సుశాంత్ ను ఏకంగా 7 సినిమాల నుంచి తప్పించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా ప్రచారం దాదాపు నిజమే అన్నట్టు స్పందించాడట భన్సాలీ.

దాదాపు 3 గంటల పాటు పోలీసులు భన్సాలీని విచారించగా.. ఎంక్వయిరీలో భాగంగా 4 సినిమాల నుంచి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను తప్పించినట్టు భన్సాలీ అంగీకరించారట. ఎందుకని ప్రశ్నించిన పోలీసులకు, కాల్షీట్ల సమస్య వల్లనే అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడట.

లెక్కప్రకారం రామ్-లీల సినిమాలో సుశాంత్ సింగ్ నటించాల్సి ఉందట. దీంతో పాటు భన్సాలీ తీసిన మరో 3 సినిమాల్లో కూడా సుశాంత్ ను అనుకున్నాడట. కానీ కాల్షీట్ల సమస్య వల్ల అతడ్ని తీసుకోలేదని పోలీసులకు చెప్పాడట భన్సాలీ.

మొత్తమ్మీద ఇప్పటివరకు సుశాంత్ కేసులో అతడ్ని తప్పించిన ఆ 7 సినిమాల లిస్ట్ ఏంటో చెప్పాలంటూ సెటైర్లు వేసిన రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులకు భన్సాలీ గట్టి సమాధానమే ఇచ్చాడు. అయితే తన సినిమాల నుంచి సుశాంత్ ను తప్పించమని ఎవరైనా చెప్పారా లేక నిజంగానే కాల్షీట్ల సమస్య వల్ల సుశాంత్ ఆ అవకాశాలు పోగొట్టుకున్నాడా అనేది తేలాల్సి ఉంది.