కరోనా వస్తే అందరూ ఫోన్ చేశారు… దేవుడు పవన్‌ కల్యాణ్ ఫోన్ చేయలేదు…

ఇటీవల తాను కరోనా బారినపడినప్పుడు ఒక్కసారిగా భయమేసిందన్నారు నిర్మాత బండ్ల గణేష్. కరోనా వచ్చాక జీవితంపై ఆలోచనే మారిపోయిందన్నారు. తనకు కరోనా వచ్చిందని తెలియగానే చాలా మంది ఫోన్ చేసి పరామర్శించారని… ధైర్యం చెప్పారని గణేష్ వివరించారు.

ఫోన్‌లో చిరంజీవి 10 నిమిషాలు మాట్లాడారని… మారుతి, శీనువైట్ల, వీవీ వినాయక్ లాంటి వారు ఫోన్ చేసి పరామర్శించారని చెప్పారు. తనతో ఎలాంటి సినిమాలు చేయని మారుతి కూడా ఫోన్ చేయడం తనకు బాగా నచ్చిందన్నారు. మోహన్‌ బాబు ఫోన్ చేసి భయపడవద్దు ఏమీ కాదని ధైర్యం చెప్పారన్నారు.

పవన్‌ కల్యాణ్ మాత్రం తనకు ఫోన్ చేయలేదని బండ్ల గణేష్ వివరించారు. తనకు కరోనా వచ్చిన విషయం తెలియక పవన్ కల్యాణ్‌ ఫోన్ చేయలేదు అనుకుంటే తృప్తిగా ఉంటుందని… అందుకే తాను పవన్‌ కల్యాణ్‌కు విషయం తెలియదు కాబోలు అని సరిపెట్టుకున్నట్టు చెప్పారు.

కరోనా వచ్చిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందన్నారు. చిన్న స్థాయి నుంచి ఈస్థాయికి వచ్చిన తర్వాత ఇంకా పాకులాడడం దేనికి అనిపించిందన్నారు. ఇకపై ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఎదుటి వ్యక్తిని ఒక మాట అనడం, వాళ్లు తిరిగి 10 మాటలు అంటే బాధపడడం ఇదంతా దేనికి అని బండ్ల గణేష్ ప్రశ్నించారు. చేతనైతే సాయం చేస్తానని… చేయలేని పక్షంలో కనీసం ఎదుటివారికి హాని చేయకుండా ఉండాలి అని తాను నిర్ణయించుకున్నట్టు బండ్ల వివరించారు.