తీవ్ర జ్వరంతో రోడ్డుపైనే కుప్పకూలి యువకుడి మృతి

హైదరాబాద్‌ ఈసీఐఎల్ చౌరస్తాలో విషాదం చోటు చేసుకుంది. ఒక యువకుడు తీవ్ర జ్వరంతో బాధపడుతూ రోడ్డుపైనే కుప్పకూలిపడిపోయాడు. అంబులెన్స్ వచ్చే లోపు ప్రాణాలు విడిచాడు.

మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పృథ్వీరాజ్…‌ వైద్యం కోసం కుటుంబసభ్యుల సాయంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు తీవ్ర జ్వరం ఉండడంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

కరోనా లక్షణాలుండడంతో వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బందే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. గాంధీ ఆస్పత్రికి వెళ్లేందుకు బయటకు వచ్చిన యువకుడు అందరూ చూస్తుండగానే రోడ్డుపై ఒక్కసారిగా పడిపోయాడు.

108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే అతడు చనిపోయాడు. కరోనా భయం నేపథ్యంలో పృథ్వీరాజ్‌కు సాయం చేసేందుకు సామాన్యులెవరూ సాహసించలేదు.. పృథ్వీరాజ్‌ మరణంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు.