రాష్ట్రం విడిపోయింది గానీ… తెలంగాణలోనే వైఎస్‌కు ఫ్యాన్స్ ఎక్కువ

వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూస్తేనే సగం కష్టాలు మరిచిపోయేవారిమన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో దేశానికి చూపించిన వ్యక్తి వైఎస్‌ఆర్‌ అన్నారు.

వైఎస్ జయంతి సందర్భంగా మాట్లాడిన ఆయన… రాజకీయ నాయకులకు వైఎస్‌ఆర్‌ ఒక మార్గదర్శి అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రులు సొంత పార్టీ వారికి మాత్రమే అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని… వైఎస్‌ మాత్రం ఏ పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లినా వారి పనులు చేసి పెట్టేవారన్నారు.

రాష్ట్రం విడిపోయి రాజకీయంగా మార్పులు వచ్చాయని… అయినా రాయలసీమ, కోస్తా కంటే వైఎస్‌రాజశేఖర్ రెడ్డికి తమ తెలంగాణలోనే అభిమానులు అధికంగా ఉన్నారన్నారు. ఇప్పటికీ పల్లెల్లోకి వెళ్తే ఆరోగ్య శ్రీ లాంటి పథకాల పేర్లు చెబితే వైఎస్‌ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. తెలుగువారుఉన్నంత కాలం వైఎస్‌ఆర్‌ గుర్తుండిపోతారన్నారు.

వైఎస్‌ఆర్‌ పాలనతో పోలిస్తే జగన్‌ పాలన ఎలా ఉందని ప్రశ్నించగా… కేసీఆర్‌ పాలన కంటే జగన్ వంద అడుగులు ముందే ఉందన్నారు. ఏపీలో పదిలక్షల కరోనా పరీక్షలు చేయడం, విద్యా, వైద్యానికి అక్కడిస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే ప్రజల్లో ఆలోచన కలుగుతోందన్నారు.

కీలకమైన విద్యా, వైద్యం తెలంగాణలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయని… అక్కడ ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ రెండు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ మన్ననలు పొందుతున్నారన్నారు. తెలంగాణలో 5వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడితే… ఏపీలో ప్రభుత్వ స్కూళ్లను బాగుచేస్తూ… ఇంగ్లీష్ మీడియం కూడా అందించేందుకు సిద్దపడడం అభినందించదగ్గ అంశమన్నారు.