Telugu Global
NEWS

తెలంగాణలో ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్షలు... అరగంటలోనే ఫలితం

తెలంగాణలో అతి తక్కువ కరోనా పరీక్షలు చేస్తుండడంతో, మిగిలిన రాష్ట్రాల కంటే పాజిటివ్ రేటు భారీగా ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అన్నివైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు వేగవంతం చేసేందుకు సిద్దమైంది. ర్యాపిడ్ యాంటిజెన్ డిటెక్షన్ టెస్టులు ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. నేడు కూడా కిట్ల ద్వారా భారీగా పరీక్షలు చేస్తున్నారు. తొలి దశలో 50వేల కిట్లను ప్రభుత్వం తెప్పించింది. ఈ పద్దతిలో కేవలం 30నిమిషాల్లోనే […]

తెలంగాణలో ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్షలు... అరగంటలోనే ఫలితం
X

తెలంగాణలో అతి తక్కువ కరోనా పరీక్షలు చేస్తుండడంతో, మిగిలిన రాష్ట్రాల కంటే పాజిటివ్ రేటు భారీగా ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అన్నివైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు వేగవంతం చేసేందుకు సిద్దమైంది. ర్యాపిడ్ యాంటిజెన్ డిటెక్షన్ టెస్టులు ప్రారంభించింది.

బుధవారం నుంచి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. నేడు కూడా కిట్ల ద్వారా భారీగా పరీక్షలు చేస్తున్నారు. తొలి దశలో 50వేల కిట్లను ప్రభుత్వం తెప్పించింది. ఈ పద్దతిలో కేవలం 30నిమిషాల్లోనే ఫలితం వస్తుంది… పాజిటివ్ వస్తే కరోనా సోకినట్టు నిర్ధారణ అయినట్టే. అయితే నెగిటివ్ వస్తే మాత్రం పూర్తిగా కరోనా లేదని ఈపద్దతిలో నిర్దారించుకోవడానికి లేదు.

పాజిటివ్‌ వస్తే దాని ఖచ్చితత్వం 99.3 నుండి 100 శాతం ఉంటుందని ..నెగెటివ్‌ వస్తే దాని ఖచ్చితత్వం 50 నుంచి 70 శాతం వరకు మాత్రమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఈ పద్దతిలో నెగిటివ్ వస్తే మరోసారి ఆర్‌టీపీసీఆర్ ద్వారా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కరోనా కేసులు భారీగా ఉన్నాయన్న భావన నేపథ్యంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ఈ యాంటిజెన్ కిట్ల ద్వారా గుర్తించడానికి వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకు ఆర్‌టీపీసీఆర్‌ పద్దతిలో పరీక్షలు చేస్తుండడం వల్ల ఫలితాలు రావడానికి నాలుగు నుంచి వారం రోజుల వరకు సమయం పడుతోంది. ఈ సమయంలో వైరస్ తీవ్రత మరింత పెరుగుతోంది. వ్యక్తులు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రస్తుతం 50వేల యాంటిజెన్ కిట్లు తీసుకురాగా… అవి సరిపోవని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కోటి జనాభా ఉందని… చాలా పరీక్షలు చేయాల్సి ఉంటుందని…ఈ 50వేల కిట్లు నాలుగైదు రోజులకు సరిపోతాయని అభిప్రాయపడుతున్నారు.

First Published:  9 July 2020 3:09 AM GMT
Next Story